బీజేపీ గూండాల పార్టీ , భారత్‌కీ జాహిల్ పార్టీ అని విమర్శించిన ఆప్ నేత రాఘవ్ చద్దాపై ఆ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. అంతేకాకుండా బీజేపీ యువమోర్చా పంజాబ్ ఉపాధ్యక్షుడు అశోక్ సరీన్ ఆదివారం లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసు పంపారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని ‘గూండాల’పార్టీగా ‘భారత్ కీ జాహిల్ పార్టీ’గా రాజ్యసభ సభ్యుడు, ఢిల్లీ జల్ బోర్డు వైస్ చైర్మన్ అయిన రాఘవ్ చద్దా విమర్శించి ఈ వివాదానికి తెర లేపారు.
నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ అంటే ‘భారత్ కీ జాహిల్ పార్టీ’ అని చద్దా అన్నారు. బీజేపీ గూండాలు, పోకిరీల పార్టీగా మారిందని తీవ్ర విమర్శలు చేశారు. రాఘవ్ చద్దా ప్రకటన బీజేపీ నేతలను ఉలిక్కిపడేలా చేసింది. సరీన్ తన న్యూఢిల్లీ చిరునామాలో చద్దాకు లీగల్ నోటీసు పంపారు. IPC సెక్షన్లు 499, 500 కింద అతనికి రాతపూర్వక క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
మీరు తప్పుడు, దురుద్దేశపూర్వకంగా ప్రతిష్టను తగ్గించి, సమాజంలోని ప్రజల మనస్సులలో బీజేపీకి వ్యతిరేకంగా దుష్ప్రవర్తన సృష్టించారు. ఈ వ్యాఖ్యలు కించపరిచేవి, పరువు నష్టం కలిగించేవిగా ఉన్నాయి. మొత్తం బిజెపిని హత్య చేయడంతో ఈ మాటలు సమానం” అని ఆ నోటీసులో పేర్కొన్నారు. అశోక్ సరీన్ ఆదివారం పంపిన లీగల్ నోటీసులో మూడు రోజుల్లోగా AAP నాయకుడు రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సివిల్, క్రిమినల్ ఫిర్యాదు దాఖలు చేస్తామని హెచ్చరించారు. కాగా, దీనిపై వ్యాఖ్యానించేందుకు రాఘవ్ చద్దా అందుబాటులోకి రాలేదు.