యూపీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏ పార్టీతో తమకు పొత్తు లేదని, ఒంటరిగానే పోటీ చేస్తున్నామని, ఈ ఎన్నికల్లో 80 శాతం సీట్లు కచ్చితంగా గెలిచి తీరుతామని ఆ రాష్ట్ర సీఎం యోగీ ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేశారు. ఆయన అధికారిక నివాసంలో ఆంధ్రప్రభ-ఇండియా ఎ హెడ్ జాతీయ ఆంగ్ల న్యూస్ ఛానెల్‌తో మాట్లాడారు. ఎడిటర్ ఇన్ చీఫ్ భూపేంద్ర చౌబేతో పాటు పొలిటికల్ ఎడిటర్ అదితీ అనంతనారాయణ చేసిన ఇంటర్వ్యూలో.. 80:20 ఫార్ములాయే మళ్లి పునరావృతం అవుతుందని యోగీ ఆదిత్యనాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలో కులం, భాష, మతం, వర్గం ప్రాతిపదికన పాలన జరగలేదన్నారు. ముఖం చూసి కరోనా కాలంలో రేషన్ బియ్యం ఉచితంగా ఇవ్వలేదన్న యోగీ.. బీఎస్‌పీ, ఎస్‌పీ హయాంలో ఇవన్నీ జరిగాయని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ 80 శాతం సీట్లు సాధించామని గుర్తు చేశారు. 2016లో దేశంలోనే అత్యంత అసమర్థ సీఎంగా అఖిలేష్ పేరు ప్రఖ్యాతులు సంపాధించుకున్నారన్నారు. భద్రత విషయంలో రాజీపడలేదన్న యోగీ.. నేరాల సంఖ్యను రాష్ట్రాలతో పోల్చొద్దన్నారు. బీఎస్‌పీ, ఎస్‌పీతో బీజేపీ పాలనను పోల్చితే బాగుంటుందన్నారు. 2017 తరువాత ఒక్క ఆకలి చావు, రైతు ఆత్మహత్య నమోదు కాలేదన్నారు.
దేశానికి ఓ దిశ చూపించారు..
కరోనా మహమ్మారి భారత్‌లో ప్రవేశించిన తరువాత.. దేశానికి ఓ దిశ చూపించారు. విపత్కర పరిస్థితుల్లో కూడా ఎలా ముందుకు వెళ్లాలి.. అన్న విషయాన్ని యావత్ ప్రపంచానికి తెలియజేశారు. కరోనా వచ్చిన తరువాత.. తొలిసారి ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లిdకి ఎన్నికలు జరుగుతున్నాయి. థర్డ్ వేవ్ కూడా భారత్‌ను తాకింది. ఈ నేపథ్యంలో కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది. పరిస్థితి చక్కబడటంతో.. ప్రస్తుతం ఆంక్షలు అన్నీ ఎత్తేశారు. 172 అసెంబ్లిd స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. యూపీ అసెంబ్లి ఎన్నికలు ఎంతో కీలకమైనవి. ఉత్తర్‌ప్రదేశ్లో మొత్తం 80 శాతం సీట్లు బీజేపీ దక్కించుకుంటుంది. 20 శాతం స్థానాల్లో మాత్రమే మిగిలిన పార్టీలు విజయం సాధిస్తాయి. అంతిమంగా యూపీలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే..
ఒకప్పటి పరిస్థితుల్లేవు..
పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్ నుంచి ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. ఇక్కడ జాట్, రైతులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. 2014 తరువాత.. ప్రతీ ప్రాంతంలో కుల, వర్గ, మత సంబంధమైన వాటిలో ఎన్నో మార్పులు వచ్చాయి. పురుషులు, మహిళల విషయంలోనూ కీలక మార్పులు చూసేందుకు దొరికాయి. 2014 కంటే ముందు నాటి పరిస్థితులు ఇప్పుడు యూపీలోనే కాదు.. దేశంలో ఎక్కడా లేవు. మోడీ అధికారంలోకి వచ్చాక.. పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2017 యూపీ అసెంబ్లి ఎన్నికల్లో 325 స్థానాలు బీజేపీ గెలుచుకుంది. ఇది మొత్తం స్థానాల్లో 80 శాతమే అవుతాయి కదా..? ఆ సమయంలో.. ఇద్దరు అబ్బాయిలు (అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ) కలిసి మహా ఘట్ బంధన్ ఏర్పాటు చేశారు. అధికారంలో ఉన్న ఎస్‌పీ.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది. లోక్‌దళ్‌తో పాటు మరికొన్ని పార్టీలు జత కట్టాయి. అప్పుడే బీజేపీకి 80 శాతం సీట్లు వచ్చాయి.
ఏ కూటమీ.. ఓడించలేదు..
2019.. లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ.. మహా ఘట్ బంధన్ ఏర్పాటైంది. ఎస్‌పీ, బీఎస్‌పీ, కాంగ్రెస్, లోకదళ్ అందులో ఉన్నాయి. ఆ సమయంలోనే.. బీజేపీ 80 శాతం సీట్లు సాధిస్తుందనే దృఢ నిశ్చయంతో ఉండింది. రాజకీయ విశ్లేషకులు కూడా దీన్ని స్వాగతించారు. 80 లోక్‌సభ స్థానాలకు పోటీ జరగ్గా.. 64 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఇది 80 శాతం సీట్లు అవుతాయి. 16-10 బీఎస్‌పీ, ఎస్‌పీ 5, కాంగ్రెస్ 1 స్థానం, మిగిలినవి ఇతర పార్టీలు గెలిచాయి. ఇది 20 శాతం స్థానాలే అవుతాయి. 2022 అసెంబ్లి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎవరికీ తెలియకుండా మీ మీడియా సంస్థ.. 100 మంది అభిప్రాయాలు తెలుసుకోండి. ఇందులో 80 మంది బీజేపీకి అనుకూలంగానే మాట్లాడుతారు. మోడీకే ఓటేస్తామని చెబుతారు. ప్రస్తుతం.. భారతీయ రాజకీయ వ్యవస్థ ఎంతో అద్భుతంగా కొనసాగుతున్నది. కాంగ్రెస్ హయాంలో జరిగిన అన్ని అన్యాయాలకు 2014లో మోడీ స్వస్తి పలికారు. ఆ నాటి నుంచి మోడీ.. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు.
ఇప్పుడు అన్ని చోటా అభివృద్ధే..
కాంగ్రెస్ హయాంలో భాష, ప్రాంతం, వర్గం, మతం వారీగా ఎన్నికలు జరిగేవి. మోడీ వీటన్నింటినీ తుడిచిపెట్టేశారు. అందరూ ఒక్కటే అన్న భావన తీసుకొచ్చారు. ఇప్పుడు కేవలం అభివృద్ధి మాత్రమే అన్ని వైపులా విస్తరించబడింది. దీనిపైనే ఎక్కడ చూసినా మాట్లాడటం జరుగుతున్నది. మంత్రి మండలిలో చోటు అయినా.. సీట్ల కేటాయింపు అయినా.. పథకాలు అయినా.. వర్గం, మతం, కులం ప్రాతిపదికన కేటాయించలేదు. సమాజానికి నాయకుడు దొరకాలి. వారికి ఉన్న మంచి అనుభవాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకున్నాం. బీజేపీ అధికారంలోకి వచ్చాక.. కేంద్రంలో, రాష్ట్రంలో ఓటు బ్యాంకు రాజకీయాలకు తావివ్వలేదు. ఓ వర్గం వ్యక్తిని కించపర్చడం, మరో వర్గం వ్యక్తికి అందలం ఎక్కించడం ఎక్కడా జరగలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అన్ని వర్గాల వారికి సమానంగానే తీసుకొచ్చాం. రుణ మాఫీ చేస్తామనే మేము అధికారంలోకి వచ్చాం. అది చేశాం.. ఇందులో కుల, మతం అనేది చూడలేదు. చిన్న, సన్న కారు రైతులకు సంబంధించిన రూ.1లక్ష రుణాన్ని మాఫీ చేశాం. ఇందులో మతానికి, వర్గానికి, కులానికి అవకాశం లేదు.
రిజర్వేషన్లు అమలు చేశాం..
ఇళ్లు లేని వారికి పక్కా ఇల్లు కట్టి ఇచ్చాం. సమాజంలోని ప్రతీ ఒక్కరు లబ్ది పొందారు. రిజర్వేషన్లు పక్కాగా అమలు చేశాం. ప్రతీ ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లాం. ఓబీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనార్టీలకు సరైన స్థాయిలో రిజర్వేషన్ కల్పించాం. మహిళలకు భద్రత విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకున్నాం. ఇక్కడ సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ అనేది కనిపించింది. చట్టం అందరికీ సమానం. ఈ ఎన్నికలు.. ప్రతీ ఒక్కరి భద్రత, పేదలకు మెరుగైన సౌకర్యాల కల్పన ఆధారంగా కొనసాగుతున్నాయి. గుడిసెలో ఉండే వ్యక్తి అయినా.. భవనంలో ఉండే వ్యక్తి అయినా.. సుఖంగా ఉండాలంటే.. అతనికి భద్రత అనేది ఎంతో కీలకం. జీరో టోలరెన్స్‌ను అమలు చేశాం. ప్రతీ పేదోడికి ఇళ్లు, మరుగుదొడ్డి, విద్యుత్ సౌకర్యం కల్పించడం జరిగింది. కేంద్ర పథకాలు అందరికీ సమానంగా అందించాయి.
పాలనపై సందేహమే లేదు..
ప్రభుత్వ పాలనపై ఎలాంటి సందేహాలు లేవు. కాంగ్రెస్ హయాంలో ముఖం చూసి చర్యలు ఉండేవి. కానీ బీజేపీ వచ్చాక ముఖం చూసి చర్యలు తీసుకోలేదు. ఇందులో మతం, కులానికి స్థానమే లేదు. ఎవరు నేరం చేసినా.. చట్టరీత్యా శిక్ష అనుభవించాల్సిందే.. ఇందులో ఎవరికీ.. ఎలాంటి మినహాయింపు లేదు. నేను ఏ ఒక్క వర్గాన్ని వెనుకేసుకుని రావడం లేదు. యూపీలోని 25కోట్ల మంది ప్రజల మంచి కోసం ఆలోచించే వ్యక్తిని. 2017కు ముందు.. విద్యుత్ సౌకర్యం పొందాలంటే.. మతం, కులం ప్రాతిపదికన ఉండేది. కొన్ని వర్గాలకు మాత్రమే కొమ్ము కాసేవారు. కానీ మేము 25కోట్ల ప్రజలు మాకు సమానమే. అన్ని వర్గాల వారి పండుగలకు.. అన్ని రకాల సదుపాయాలు కల్పించాం. 15 కోట్ల మందికి కరోనా సమయంలో ఉచితంగా రేషన్ అందజేశాం. ఇందులో కూడా కులం, మతానికి స్థానం లేదు. మేము ముఖం చూసి రేషన్ ఇవ్వలేదు. ఇది మా కర్తవ్యంగా భావించాం. ఓటు బ్యాంకు రాజకీయాలు చేయలేదు.
నేరాలు చాలా తగ్గాయ్..
2017 కంటే ముందు ఆకలి చావులు చూశాం. ఓ రాజకీయ నేతగా ఎన్నో ప్రాంతాలు పర్యటించాను. సమాజ్‌వాదీ పార్టీ దీనిపై సమాధానం ఇస్తుందా..? బీజేపీ అధికారంలోకి వచ్చాక ఒక్క ఆకలి చావు కూడా నమోదు కాలేదు. రైతుల ఆత్యహత్యలు జరగలేవు. ఇది అభివృద్ధి కాకపోతే మరేంటి..? మా సంకల్పానికి తగినవిధంగా ముందుకు వెళ్తున్నాం. ఎన్‌సీఆర్‌బీ లెక్కలు సరైనవే. 2017 కంటే ముందు జరిగిన నేరాలు ఇప్పుడు లేవు. యూపీలో 25కోట్ల మంది ప్రజలు ఉంటారు. ఇంత పెద్ద రాష్ట్రాన్ని.. చిన్న రాష్ట్రమైన గోవాతో సరిపోల్చలేం. జనాభా ప్రాతిపదికన చూసుకుంటే.. యూపీలో నేరాలు చాలా తగ్గాయి. ఢిల్లిdలో 1.75 కోట్ల మంది ప్రజలు ఉంటారు. నేరాల విషయంలో రాష్ట్రాలతో పోలిస్తే.. జనాభాను కూడా గమనించాలి. 2012-2017 నుంచి 2017-2022 మధ్య జరిగిన నేరాలను పోలిస్తే బాగుంటుంది. రేప్‌లు, హత్యలు, కిడ్నాప్‌లు, మహిళలపై దాడులు గత ప్రభుత్వంతో పోల్చాల్సిన అవసరం ఉంది. బీజేపీ హయాంలోనే నేరాలు బాగా తగ్గాయి.
బీజేపీ పాలనలో జీరో టోలరెన్స్
దేశంలోనే అత్యంత విఫలమైన సీఎంగా అఖిలేష్ యాదవ్‌ను.. 2016లో ఓ మీడియా సంస్థ చేసిన అధ్యయనంలో తేలింది. అదే మీడియా సంస్థ.. ఇప్పుడు అధ్యయనం చేస్తే.. దేశంలోనే అత్యంత మంచి సీఎం ఎవరు అంటే.. యూపీ పేరు వినిపిస్తుంది. 2017కు ముందు.. ఆ తరువాత ఏం జరిగిందనడానికి పోలిక ఉండదు. ఈ ఎన్నికల విషయంలో తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. మంచి చేస్తే.. ప్రతీ ఒక్కరు ఆదరిస్తారు. ఏదో ఒక రోజు అఖిలేష్ యాదవ్ కూడా బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం గురించి ప్రశంసిస్తారు. యూపీలో ఎన్ని బాంబు పేలుళ్లు జరిగినా.. అవి సమాజ్‌వాదీ పార్టీ హయాంలోనే జరిగాయి. బహుజన్ సమాజ్ పార్టీలోనూ ఇలాంటి ఘటనలు కొన్ని చూశాం. కానీ బీజేపీ అధికారంలోకి తరువాత ఇలాంటివి ఏవీ చూసేందుకు దొరకలేదు. రాష్ట్ర వ్యవస్థకు కీలకం లా అండ్ ఆర్డర్. మాఫియాను పెంచి పోషించారు. తమ స్వార్థ రాజకీయాల కోసం పేదలను బలి చేశారు. ఉగ్రవాదులకు సంబంధించిన విచారణలను వెనక్కి తీసుకునే నిర్ణయం కూడా ఎస్‌పీ, బీఎస్‌పీ హయాంలోనే చూశాం.
పేలుళ్లతో అమాయకులు బలి
లక్నో, అయోధ్య, వారణాసిలో జరిగిన పేలుళ్ల ఘటనలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. సంకట్ మోచన్ ఆలయంలో జరిగిన పేలుడు ఘటనలో 28 మంది అమాయకులు చనిపోయారు. 2012లో ఎస్‌పీ తన మేనిఫెస్టోలో ఓ కీలకం అంశం చేర్చింది. ఈ ఉగ్రవాద ఘటనల విషయంలో.. నిర్ధోషులుగా ఉన్న వారిని జైలు నుంచి విడిపిస్తామని ప్రకటించింది. 2012-2013లో దీనికి సంబంధించిన విచారణలను వెనక్కి తీసుకొచ్చేందుకు నిర్ణయించింది. ఏ పేలుడులో అయినా సైకిల్ ఉపయోగం జరిగింది. అహ్మదాబాద్లో జరిగిన వరుస పేలుళ్లలో కూడా సైకిళ్లను వాడారు. అందుకే సైకిల్ అంటే ఉగ్రవాదం అని అంటాను. ఇలాంటి వ్యక్తుల గురించి మాట్లాడాలంటే ఆలోచించాల్సి ఉంటుంది. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ మోడీ నినాదం.
సామాజిక భద్రత ముఖ్యం
సమాజంలో ఓ గ్రూప్ ఉంది. అది కేవలం కొన్ని వర్గాలను మాత్రమే ప్రోత్సహిస్తూ ఉంటుంది. యూపీలో బీజేపీయేతర ప్రభుతం వస్తే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుతాలు అమలు చేస్తున్న పథకాలు నిలిపివేస్తాయనే వార్తలు వినిపిస్తున్నాయి. సామాజిక భద్రత ప్రాధాన్యతగా తీసుకుంటున్నాం. ప్రతీ ఒక్కరి స్వాలంబనే మా కర్తవ్యం. మాకు ఓటు బ్యాంకు రాజకీయాలు చేయలేదు. ప్రతీ ఒక్కరు అన్ని రకాలుగా ప్రగతి సాధించాలనేది మా లక్ష్యం. ప్రతీ ఒక్కరి జీవితంలో నియమ నిబంధనలు ఉంటాయి. అది సంస్థ అయినా.. ప్రభుత్వం అయినా.. ఒక ప్రాంతం, ప్రదేశంలో డ్రెస్ కోడ్ అమల్లో ఉంటే.. అది పక్కాగా అమలు చేయాల్సిందే. ప్రధానంగా స్కూల్స్ నిబంధనలు పాటించాలి. తమ వ్యక్తిగత నిర్ణయాలు సమాజంపై రుద్దలేం. రాజ్యాంగం ప్రకారం ముందుకు వెళ్లాలి. చట్టపరంగా ముందుకు వెళ్లలేం. త్రిపుల్ తలాక్‌ను మోడీ లేకుండా చేశారు. ఈ విషయంలో ముస్లిం ప్రజలు మోడీకి ధన్యవాదాలు తెలియజేయాలి.
యూపీ.. దేశానికే రోల్ మోడల్
డ్రెస్ కోడ్ అంశం అనేది పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటాం. యూపీలో రాజ్యాంగం, చట్టం ప్రకారం ముందుకు వెళ్తాం. ఎవరైనా ఎందుకు.. ఇతరులను ప్రేరణగా తీసుకోవాలి..? నేను రాముడు, శ్రీకృష్ణుడిని నమ్ముతాను. ఆయన అడుగు జాడల్లోనే నడుస్తాను. వీరి నుంచి ప్రేరణ పొందుతాను. ప్రధాని మోడీని రోల్ మోడల్‌గా చేసుకుంటాను. ఆయన చేసిన అభివృద్ధి ప్రణాళికలు.. యూపీలో అమలు చేసేలా చూస్తాను.