Saturday, September 28, 2024

మిత్రపక్షం జనసేన ఎందుకు పోటీ చేయడం లేదు?

ఏపీలో త్వరలో జరిగే తిరుపతి ఉపఎన్నిక సీటు బీజేపీకే ఖరారైంది. మిత్రపక్షం జనసేనకు అవకాశం ఇవ్వకుండా తామే పోటీ చేయాలని బీజేపీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కారణంగా ఇప్పుడు ఏపీలో బీజేపీపై వ్యతిరేకత ఉంది. ఈ అంశాన్ని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే ఈ వ్యతిరేకతను గమనించే బీజేపీ మిత్రపక్షం జనసేన కూడా పోటీకి ముందుకు రాకుండా బీజేపీ అభ్యర్థికి మద్దతివ్వాలని నిర్ణయించుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే తమ అభ్యర్ధిని ఎంపిక చేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దాసరి శ్రీనివాస్‌తో పాటు మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు, మరికొందరి పేర్లను తిరుపతి ఉపఎన్నిక కోసం బీజేపీ పరిశీలిస్తోంది.

కాగా తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయడంవల్ల ప్రజా తీర్పుకు అవకాశం ఏర్పడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అభిప్రాయపడ్డారు. తిరుపతి ఉప ఎన్నికలో ఓట్లు అడగడానికి రాష్ట్ర బీజేపీ నేతలు ఏ మొహం పెట్టుకుని వస్తారని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేస్తున్నందుకు, తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధాని మోడీ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ నెరవేర్చనందుకు, విభజన చట్ట హామీలు అమలు చేయనందుకు, ఏపీకి కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించనందుకు ఈ ఎన్నికలో ప్రజలు బీజేపీ బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. మొత్తం మీద తిరుపతి ఉప ఎన్నికలో జనసేన తప్పుకొని బీజేపీని ఊబిలోకి తోసిందని రామకృష్ణ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement