హైదరాబాద్, ఆంధ్రప్రభ : దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలపడుతుందనే భయంతో బీజేపీ కుట్రలు చేస్తోందని టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండానే కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహల్‌గాంధీలకు ఈడీ నోటీసులు ఎలా ఇస్తారని ఆయన మండిపడ్డారు. గాంధీ కుటుంబం మీద ఈగ వాలిన బీజేపీ రాజకీయంగా బతికి బట్ట కట్టలేదని ఆయన హెచ్చరించారు. ఈ నెల 23న సోనియాగాంధీ ఈడీ కార్యాలయంలో అడుగు పెడితే బీజేపీ పునాదులు కదులుతాయన్నారు. రాహుల్‌గాంధీనీ ఈడీ విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పిలుపు నివ్వడంతో.. సోమవారం టీ పీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ సోనియాగాంధీ మీద చేయివేస్తే నరికేస్తామని, తెలంగాణ కళ సాకారం చేసిన దేవతను ఈడీ ఆఫీసుకు పిలిస్తే ఊరుకుంటామా..? అని ఆయన మండిపడ్డారు.
‘త్యాగాలు చేసిన గాంధీ కుటుంబం తప్పు చేసిందంటే ప్రజలు నమ్మరు. ఇందిరాగాంధీని 1979లో జైలుకు పంపిస్తే దేశం మొత్తం మద్ధతుగా నిలిచింది. ఆ తర్వాత 1980లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించారు. ఇప్పుడు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను ఇబ్బందులు పెడుతున్నారు. 2024లో తిరిగి కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించబోతుంది. ఈడీలు, సీబీఐలు గాంధీ కుటుంబాన్ని ఏమి చేయలేవు. నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి వేసిన పిటిషన్‌లో సుప్రీంకోర్టు కూడా ఎలాంటి అవకతవకలు జరగలేదని తేల్చింది. 2017లోనూ ఈడీ కూడా అవకతవకలు లేవని స్పష్టం చేసింది ‘ అని రేవంత్‌రెడ్డి వివరించారు.
‘1937లో నెషనల్ హెరాల్డ్ పత్రికను నెహ్రు స్థాపించారు. సర్దార్ పటేలు కూడా ఆ పత్రిక ఏర్పాటులో భాగం పంచుకున్నారు. స్వాతంత్రోద్యమంలో ప్రజల్లో ఐక్యత పెంచేందుకు నేషనల్ హెరాల్డ్‌ను స్థాపించారు. ఎన్నో కష్టాలకు ఓర్చి నెహ్రు కుటుంబం ఆ పత్రికను నడిపింది. పత్రిక నష్టాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ రూ. 90 కోట్లు ఇచ్చి ఉద్యోగులకు జీతాలు ఇచ్చింది. బీజేపీ కుట్రలను వివరిస్తున్నందుకు నేషనల్ హెరాల్డ్ పత్రికపై కేసు వేయించారు. నెషనల్ హెరాల్డ్‌లో ఎలాంటి నగదు బదిలీ జరగలేదని ఈడీ 2017లో తేల్చింది. బీజేపీ పాలనలో పేదల జీవితాలు చిన్నాభిన్నమైనాయి. మోడీ సర్కార్ నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తోంది ‘ అని ఆయన మండిపడ్దారు.
ఈడీ నోటీసులకు సోనియా, రాహుల్‌గాంధీలు బయపడే వ్యక్తులు కాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. బీజేపీ బెదిరింపులకు భయపడేది లేదని ఆయన తెలిపారు. ఇందిరాగాంధీని జైలుకు పంపిస్తే ఏమి జరిగిందో దే ప్రజలకు తెలుసన్నారు. ఇప్పుడు సోనియా, రాహుల్‌గాంధీలను కాపాడుకుంటామని భట్టి తెలిపారు. బీజేపీని ఈ దేశం నుంచి తరిమికొడుతామని ఆయన హెచ్చరించారు. బీజేపీ పై పోరాటం ఇది అంతం కాదని, ఆరంభం మాత్రమేనని భట్టి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కాలని బీజేపీ చూస్తోందని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక ఇప్పటిది కాదని, స్వాతంత్రోధ్యమం సమయంలో పెట్టిందన్నారు.
స్వాతంత్రోధ్యమం కోసం గాంధీ కుటుంబం తమ ఆస్తులను ఖర్చు చేసిందని శ్రీధర్‌బాబు తెలిపారు. ఈస్ట్ ఇండియా కంపెనీకి పట్టిన గతి బీజేపీకి పడుతోందన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడే అవినీతి చేయని గాంధీ కుటుంబం, అలాంటిది హెరాల్డ్ పేపర్‌తో అవినీతి చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. బీజేపీ ముక్త్ భారత్ చేస్తామని ఆయన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, ఎమ్మెల్యే సీతక్క, మహేశ్వర్‌రెడ్డితో పాటు డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల చైర్మన్లు తదిరులు పాల్గొన్నారు.