తెలంగాణకు టూరిస్టుల్లా వచ్చి.. అబద్ధాలు చెబుతూ పబ్బం గడుపుకుంటున్నారని బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇవ్వాల (ఆదివారం) తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన నిన్న జరిగిన బీజేపీ తుక్కుగూడ సభలో ముఖ్యుల ప్రసంగాలపై పాయింట్ టు పాయింట్ అటాక్ చేశారు. ఒక్కో లీడర్ చెప్పిన మాటలన్నీ అబద్ధాలు, అర్ధ సత్యాలేనని కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర హోంమంత్రి హోదాలో ఉండి తెలంగాణలో మిషన్ భగీరథకు 25వేల కోట్లు ఇచ్చినట్టు అబద్ధాలు చెప్పారని అమిత్‌షాపై ధ్వజమెత్తారు. కేంద్రానికి జీఎస్టీ రూపంలో తెలంగాణ నుంచి 3లక్షల కోట్లు ఇస్తే.. తిరిగి మాకు ఇచ్చింది కేవలం లక్ష కోట్లేనని చెప్పుకొచ్చారు. పేట్రో రేట్లు పెంచి ప్రజల నుంచి అక్రమంగా 26 లక్షల కోట్లు దోపిడీ చేసిన ఈ బీజేపీ ప్రభుత్వానికి జనాలే తగిన గుణపాఠం చెబుతురాన్నారు. వెటకుక్కల్లా ఏజెన్సీలను మీ చెప్పు చేతుల్లో పెట్టుకుని మీ ఇష్టమున్నట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా స్టీరింగ్ బ్రహ్మాండంగా మా చేతుల్లోనే ఉంది.. మీ స్టీరింగ్ సక్కగా చూసుకోవాలని అని చురకలంటించారు కేటీఆర్.
కాగా, అప్పుల్లో 28 రాష్ట్రాల్లో 23వ ప్లేసులో తెలంగాణ ఉందని, తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిందని అబద్ధాలు చెప్పడం వారికే చెల్లిందని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. తెలంగాణలో అప్పులు చేసి కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి అద్భుతమైన పథకాలు చేపట్టామని, వాటితో ప్రజలు పంటలు పండిస్తూ సంతోషంగా ఉన్నారన్నారు. ఇక మీ ఆటలు ఎన్నో రోజులు సాగవని, హమ్‌దో హమారేదో అన్నట్టు బీజేపీ ప్రభుత్వం తీరు ఉన్నదని సీరియస్ అయ్యారు. బీజేపీకి ఓ నాయకుడు లేడు. ఓ చరిత్ర లేదు అని మండిపడ్డారు.
అంతే కాకుండా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా దిక్కుమాలిన పరిపాలన చేస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోడీ అసమర్థ పాలన అంటూ ధ్వజమెత్తారు మంత్రి కేటీర్. ఈ దిక్కుమాలిన ప్రభుత్వం చేసిన పాపపు పనులతో పేదలు తిండికి నోచుకోలేని పరిస్థితులు వచ్చాయని, హంగర్ మేనేజ్మెంట్లో 45 ఏళ్లలో ఎన్నడూ లేని దరిద్రం దేశంలో ఉందని విమర్శలు గుప్పించారు. ఈ నాలాయక్ ప్రధాని చేతలకు ప్రపంచ దేశాలన్ని విస్తుపోయి భారత్ వైపు చూస్తున్నాయని, గత 30 ఏళ్లలో ఎన్నడే లేని విధంగా గ్యాస్ ధర వెయ్యి రూపాయలకు దాటడమే అందుకు కారణమన్నారు కేటీఆర్.