దేశవ్యాప్తంగా త్వరలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా.. ప్రధానంగా పశ్చిమబెంగాల్ పైనే అందరి దృష్టి కేంద్రికృతమైంది. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఒకరిపై ఒకరు కాలు దువ్వుతున్నారు. ఈ ఎన్నికల ప్రచారం మోదీ వర్సెస్ దీదీ అన్నట్లు సాగుతోంది. బెంగాల్‌లో ఎలాగైనా పాగా వేయాలని గట్టి పట్టుదలతో ఉన్న బీజేపీ.. గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. ప్రధాని మోదీ సహా పార్టీలోని ప్రముఖ నాయకులంతా.. బెంగాల్ ప్రచార క్షేత్రంలో దిగారు. ఇక అధికారంలో ఉన్న మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కూడా ప్రచారంతో హోరెత్తిస్తోంది. ఇక కాంగ్రెస్ తోపాటు కమ్యూనిస్టు పార్టీలు కూడా బెంగాల్‌లోనే మకాం వేశాయి. 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 మధ్య ఎనిమిది దశల్లో పోలింగ్ జరగనుంది. మే 2న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చావో రేవో అన్నట్లు మారింది. 2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది. ఇక 2019 ఎన్నికల తర్వాత ఆపార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో జరిగిన ఏ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదు. దీంతో పరువు కోసం బెంగాల్ లో పోటీ చేస్తోంది.
మరోవైపు టీఎంపీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నీ తానై ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. తనదైన శైలిలో ప్రత్యర్థి పార్టీపై విమర్శలకు పదును పెట్టారు. నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున సువేందు అధికారి పోటీ చేస్తుండగా.. తృణమూల్ కాంగ్రెస్ తరఫున మమతా బెనర్జీ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. గతంలో మమతా బెనర్జీ కేబినెట్లో మంత్రిగా.. ఆమె కుడి భుజంలా వ్యవహరించిన సువేందు ఇటీవల మంత్రి పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇక ప్రధాని మోదీ సైతం ప్రచారంలో దీదీని టార్గెట్ చేశారు. బెంగాల్ అభవృద్ధి బీజేపీతోనే సాధ్యమంటూ హోరెత్తిస్తున్నారు. దాంతో దేశ ప్రజలందరి దృష్టి బెంగాల్ ఎన్నికలపైనే ప్రధానంగా కేంద్రీకృతమై ఉంది.
ఈ నెల 27వ తేదీ నుంచి ఏప్రిల్ 29వ తేదీ వరకు 8 విడతల్లో జరగబోయే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల గెలుపోటములపై పలు సర్వేలు ఆసక్తికర విషయాలు వెల్లడించాయి. కొన్ని సంస్థలు టీఎంసీ గెలుస్తుందంటే.. మరికొన్ని సంస్థలు బీజేపీకే పట్టం కట్టబోతున్నారంటూ అంచనా వేస్తున్నాయి. అయితే, ప్రజల తీర్పు ఎలా ఉంటుంది? అనేది తెలియాలంటే మరికొద్ది రోజుల ఆగాల్సిందే.