Tuesday, November 19, 2024

తెలంగాణలో కొత్త రాజకీయ చదరంగం!

తెలంగాణలో ప్రతిపక్ష పార్టీల మధ్య నెంబర్ 2 ప్లేస్ కోసం పోటీ జరుగుతోంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ కు వరుస ఓటములు ఆ హోదాని కూడా దూరం చేశాయి. 2019 ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ.. అనంతరం అనూహ్యంగా పుంజుకుంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాల తర్వాత టీఆర్ఎస్ కు ధీటైన ప్రతిపక్ష పార్టీ బీజేపీనే అనే అభిప్రాయం కల్గించింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ కు ప్ర‌త్యామ్నాయం తామే అని చెప్పుకుంది. అయితే, ఇప్పుడు సీన్ పూర్తిగా మారింది. టీ.పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. నిత్యం ఏదో సమస్యపై అధికార టీఆరెఎస్ పార్టీని ఇరుకున పెట్టే కార్యక్రమం చేస్తోంది. పెట్రో ధరల పెంపు, పెగాసస్ వ్యవహారం, కోకాపేట భూముల అమ్మకంలో అవినీతి జరిగిందంటూ ఆపార్టీ టైమ్ గ్యాప్ లేకుండా రెచ్చిపోతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ గ్రాఫ్ పెరగగా… బీజేపీ గ్రాఫ్ క్రమంగా తగ్గుతోంది.

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో హైద‌రాబాద్ సిట్టింగ్ సీటు కోల్పోవ‌టంతో పాటు న‌ల్గొండ స్థానం నుండి గ‌తంలో సెకండ్ ప్లేస్ లో ఉన్న బీజేపీ నాలుగో స్థానానికి ప‌డిపోయింది. ఇక నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌కు వ‌చ్చే స‌రికి బీజేపీ అస‌లు చ‌డీ చ‌ప్పుడు లేకుండా ప‌నిచేసింది. నాగార్జున సాగ‌ర్ ఉపఎన్నికలో బీజేపీ ప్రభావం ఎక్కువ ఉంటుందని అంతా భావించారు. ఆపార్టీ నాయకులు సైతం ఆదే స్థాయిలో ప‌నిచేసినా అది కాంగ్రెస్ కు ప్ల‌స్  ఢీ కొట్టలేకపోయింది. టీఆర్ఎస్ పార్టీనే గెలిచినా.. కాంగ్రెస్ రెండో స్థానంలో నిలవడంతో బీజేపీకి షాక్ కి గురి చేసింది. అనంతరం జీహెచ్ఎంసీలో పరిధిలోని సిట్టింగ్ స్థానం అయిన లింగోజిగూడను కోల్పోయింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.  ఇక అప్పటి నుంచి బీజేపీ పతనం మొదలైందనే చెప్పాలి.

ఆ త‌ర్వాత రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక బీజేపీ పూర్తిగా సైలెంట్ అయ్యిందనే టాక్ వినిపిస్తోంది. హుజురాబాద్ ఉపఎన్నిక కోసం కష్ట పడుతున్నా.. మిగత విషయాల్లో మాత్రం బీజేపీ వీక్ అయిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హుజురాబాద్ లో ఈట‌ల‌ను గెలిపించుకున్న త‌ర్వాత బీజేపీ మ‌ళ్లీ యాక్టివ్ అవుతుందా ? అన్న చ‌ర్చ ఉండ‌గా..  ఓడిపోతే బీజేపీ పరిస్థితి ఏమిటి? అన్నది ఆసక్తి రేపుతోంది. బీజేపీలో బండి సంజ‌య్ నాయ‌క‌త్వంపై కొంద‌రు సీనియ‌ర్ల‌లో వ్య‌తిరేక‌త ఉండ‌గా, కేంద్ర నాయ‌క‌త్వంతో సీఎం కేసీఆర్ కు మ‌ధ్య స‌త్సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ తరహాలో బీజేపీలోనూ కేసీఆర్ అనుకూల నేతల ఉన్నారనే ప్రచారం ఉంది. ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్లస్ గా మారుతోంది. ఈ క్రమంలో బీజేపీలో చేరిన చాలా మంది నెమ్మదిగా కాంగ్రెస్ గూటికి చేరేందుకు ప్రణాళికు సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్,పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇద్దరిని పోల్చి చూస్తే… రేవంత్ కి ఉన్న స‌బ్జెక్జ్.. బండికి లేదు అనేది నిజం. రేవంత్ రెడ్డే కేసీఆర్ పై పోరాటం చేయ‌గ‌ల‌డ‌న్న అభిప్రాయంతో రాష్ట్ర ప్రజలు ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో కాంగ్రెస్ లో నైరాశ్యం ఉన్నా… రేవంత్ రెడ్డి వ‌చ్చాక ఆ ప‌రిస్థితి పూర్తిగా మారింది. పెట్రోల్, డీజిల్ పెరుగుద‌ల‌, పెగాస‌స్ పై కాంగ్రెస్ ఆందోళ‌న చేయ‌గా ఆ అవ‌కాశం బీజేపీకి అవ‌కాశం లేకుండా పోయిందంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే. అయితే, కాంగ్రెస్ చేసే విమర్శలను సైతం రాష్ట్ర బీజేపీ నాయకులు తిప్పికొట్టలేకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. మొత్తం మీద కాంగ్రెస్ స్పీడుతో కాషాయ పార్టీకి బ్రేకులు పడ్డాయి. ఇక హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితంపై బీజేపీ గ్రాఫ్ ఆధారపడి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement