అధికార బీజేడీ ఒడిశా పంచాయతీ ఎన్నికల్లో విజయాన్ని సాధించింది. జిల్లా పరిషత్ జోన్లలో 87.20శాతం 829స్థానాలకు, 743స్థానాలను గెలుచుకోవడం విశేషం. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) వివరాలు వెల్లడించింది. రాష్ట్రంలోని మొత్తం 852 జిల్లా పరిషత్ స్థానాల్లో, 829 స్థానాల్లో ఓట్ల లెక్కింపును కమిషన్ పూర్తి చేయగా.. మిగిలిన స్థానాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. వాటి ఫలితాలు నేడు ప్రకటిస్తామని SEC అధికారి తెలిపారు. ఇప్పటి వరకు బీజేడీ 743 సీట్లు గెలుచుకోగా ప్రత్యర్థి బీజేపీ (barathiya janatha party) 42 సీట్లు, కాంగ్రెస్ (congress) 37 సీట్లకు మాత్రమే పరిమితమయ్యాయి. స్వతంత్ర అభ్యర్థులు మూడు స్థానాల్లో గెలుపొందగా, ఇతరులు నాలుగు స్థానాల్లో విజయం సాధించారు.
ఇప్పటివరకు ప్రకటించిన ఫలితాలతో 2017లో జరిగిన పంచాయతీ ఎన్నికలను పోలిస్తే ఈ సారి BJD 267 సీట్లు అధికంగా గెలుచుకుంది. 2022లో BJP 255 జడ్పీ స్థానాలను కోల్పోయింది. 2017 ఎన్నికల్లో కాషాయపార్టీ 297 స్థానాలను కైవసం చేసుకోగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 42కి తగ్గింది. 2017లో 60 జెడ్పీ స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఇప్పుడు 37 సీట్లు మాత్రమే గెలుచుకుంది. గత ఎన్నికల్లో 17 మంది ఇండిపెండెంట్లు, ఇతరులు గెలిచిన సీట్లు ఈ ఎన్నికల్లో ఏడుకు తగ్గాయి. బీజేడీ అఖండ విజయంతో రాష్ట్రంలోని 30 జిల్లాల్లోనూ అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది. 2017లో జరిగిన ఎన్నికల్లో ఎనిమిది జిల్లాల్లో పరిషత్ లను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ 10 జిల్లాల్లోని జెడ్పీ స్థానాల్లో ఒక్కటి కూడా గెలుచుకోలేకపోగా.. కాంగ్రెస్ 18 జిల్లాల్లో ఖాతా తెరవలేకపోయింది.