Tuesday, November 26, 2024

ఒడిశా సీఎం బర్త్​డే గిఫ్ట్​.. 57 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన 76వ బర్త్ డే సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, పలు సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్​ న్యూస్​ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 57 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఇకపై కాంట్రాక్ట్ నియామకాలు ఉండబోవని స్పష్టం చేశారు నవీన్​ పట్నాయక్​. ప్రస్తుతం ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తున్నట్టు తెలిపారు.

కాంట్రాక్ట్ పద్ధతిని ఒడిశాలో పూర్తిగా రద్దు చేస్తున్నట్టు సీఎం నవీన్​ పట్నాయక్​ పేర్కొన్నారు. కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సీఎం వివరించారు. దీనికి సంబంధించి ఇవ్వాల (ఆదివారం) నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నట్టు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఏటా ఖజానాపై అదనంగా రూ.1300 కోట్ల భారం పడుతుంది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిని శాశ్వతంగా రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ రెగ్యులర్ రిక్రూట్‌మెంట్లు లేవని, కాంట్రాక్ట్ పద్ధతిలోనే రిక్రూట్‌మెంట్ జరుగుతోందని పేర్కొన్నారు. ఒడిశాలో దానికి ఇప్పుడు ఫుల్‌స్టాప్ పెడుతున్నట్టు చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం ద్వారా 57వేల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ ప్రకటన చేయగానే కాంట్రాక్ట్ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. దీపావళి ముందే వచ్చిదంటూ స్వీట్లు పంచుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement