Tuesday, November 26, 2024

బిల్ట్ క‌థ కంచికి – కార్మికులు రోడ్డు మీద‌కి…

ఉమ్మడి వరంగల్‌, ప్రభన్యూస్‌ బ్యూరో: నాలుగు దశాబ్ధాలకు పైగా వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తూ దేదీప్యమానంగా వెలుగొందింది. శ్రీకాకుళం మొదలుకొని చిత్తూరు వరకు, ఆదిలాబాద్‌ మొదలుకొని వరంగల్‌ వరకు వేలాది మంది పొట్టచేతపట్టుకొని వస్తే రెండు పూటల కడుపు నిండా అన్నం పెట్టింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 వేల కుటుంబాలకు ఉపాధి కల్పించింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని అజంజాహి మిల్లు తర్వాత రెండవ అతిపెద్ద పరిశ్రమగా బిల్ట్‌ పరిశ్రమ (కమలాపురం ఏపీ రేయాన్స్‌ ఫ్యాక్టరీ) గుర్తింపు పొందింది. వరంగల్‌ కేంద్రంగా వేలాది మందికి ఉపాధి కల్పించిన అజంజాహి మిల్లు కథ ముగిసినట్టే బిల్ట్‌ పరిశ్రమ కథ కూడా ముగిసినట్లయింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రెండవ అతిపెద్ద పరిశ్రమగా గుర్తింపు పొందిన బిల్ట్‌ పరిశ్రమ 1977లో థాపర్‌ గ్రూప్‌తో ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగల్‌రావు చేతులమీదుగా మంగపేట మండలం కమలాపూర్‌లో శంకుస్థాపన చేశారు. ఇందిరా గాంధీ ఆరు సూత్రాల పథకం కింద మారుమూల ప్రాంతాలను అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా గిరిజన ప్రాంతమైన కమలాపూర్‌లో బిల్ట్‌ పరిశ్రమకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ, ఆంధ్ర , రాయలసీమ మూడు ప్రాంతాలకు చెందిన కార్మికులు బిల్ట్‌ పిం శ్రమ ఆధారంగా జీవనం సాగించారు. దాదాపుగా 35 సంవత్సరాల పాటు నిరంతరాయంగా ఉద్యోగ ఉపాధి కల్పించిన బిల్ట్‌ పిం శ్రమను నష్టాల పేరుతో 2014 ఏప్రిల్‌ 5న యాజమాన్యం ఉత్పత్తులను నిలిపివేసింది. కొద్ది రోజుల పాటు కంపెనీలో పనిచేసిన కార్మికులకు వేతనాలను చెల్లించిన యాజమా న్యం ఆ తర్వాత పూర్తిగా నిలిపేయడంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు.

ఫ్యాక్టరీని తెరిపించాలంటూ 415 రోజుల పాటు నిరవధిక సమ్మె
థాపర్‌ గ్రూప్‌ సంస్థ బిల్ట్‌ పరిశ్రమను మూసివేయడంతో కర్మాగారం మనుగడ, తమ ఉద్యోగ భద్రత కోసం కార్మికులు ఆందోళన బాట చేపట్టారు. 415 రోజుల పాటు రిలే నిరా హారదీక్షలు నిరవధికంగా కొనసాగించారు. రాష్ట్ర, జాతీయ కార్మిక సంఘాలు కార్మికుల సమ్మెకు సంఘీభావం, మద్దతు ప్రకటించాయి. హైదరాబాద్‌లో బిల్ట్‌ కార్మికులతో కలిసి వివిధ కార్మిక సంఘాలు నిరసన దీక్షలు చేపట్టారు. అయినా.. థాపర్‌ గ్రూప్‌ సంస్థ కంపెనీ ఉత్పత్తులను తిరిగి పున:ప్రారంభించేందుకు ముందుకు రాలేదు. అటు కార్మికులకు వేతనాలు నిలిపివేసి పూర్తిగా చేతులె త్తేసింది.

స్పందించిన తెలంగాణ ప్రభుత్వం
కార్మికులు చేస్తున్న నిరవధిక దీక్షలను చూసిన తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు అండగా నిలబడే ప్రయత్నం చేసింది. థాపర్‌ గ్రూప్‌ సంస్థతో సంప్రదింపులు చేసింది. మంత్రులు కేటీఆర్‌, అజ్మీరా చందూలాల్‌, ఎంపీలు కడియం శ్రీహరి, అజ్మీరా సీతారాంనాయక్‌, అప్పటి పాలకుర్తి ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నేతృత్వంలో థాపర్‌ గ్రూపు సంస్థలతో మాట్లాడి ఏటా విద్యుత్‌ సబ్సిడీ కింద రూ.30 కోట్లు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. మొత్తం రూ.327 కోట్లు సబ్సిడీగా అందజేస్తామంటూ హామీ ఇచ్చింది. కర్మాగారాన్ని తెరిపించి కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వ హామీతో థాపర్‌ గ్రూప్‌ సంస్థ కంపెనీని తిరిగి పున:ప్రారంభిస్తామని చర్చల సందర్భంగా ప్రకటించినప్పటికీ.. ఆచరణలో అమలు చేయలేదు.

52 నెలల పెండింగ్‌ వేతనాలను చెల్లించాలంటూ కార్మికుల ఆందోళనలు
బిల్ట్‌ కార్మికులకు 52 నెలల పెండింగ్‌ వేతనాలను, 64 నెలల పెండింగ్‌ పీఎఫ్‌ను జమచేయాలంటూ కార్మికులు ఏప్రిల్‌ 25న నిాంహారదీక్షకు కూర్చున్నారు. బిల్ట్‌ ఫ్యాక్టరీ ప్రారంభిస్తే కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం తరపున రాయితీగా ఇస్తామన్న రూ.327 కోట్లు కార్మికులకు ఇచ్చి ఆదుకోవాలని కార్మికులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

- Advertisement -

అజంజాహి తరహలోనే బిల్ట్‌ కథ
వరంగల్‌ కేంద్రంగా దశాబ్ధాల పాటు వేలాది మంది చేనేత కార్మికులకు ఉపాధి కల్పించిన పెద్ద పరిశ్రమ అజంజాహి మిల్లు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 1980 దశకంలో అజంజాహి మిల్లును మూసివేసి వేలాది మంది కార్మికులను రోడ్డున పడేశారు. అజంజాహి తరహలోనే బిల్ట్‌ పరిశ్రమ కూడా మూతబడటంతో వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి వీధిన పడ్డారు. కనీసం తినడానికి తిండి లేక ఆకలి చావులు చావాల్సిన దుస్థితి బిల్ట్‌ కార్మికులకు ఏర్పడింది. కనీసం ఉపాధి లేక కనీస అవసరాలను తీర్చుకోలేని దయనీయ పరిస్థితుల్లో కార్మికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

ఎన్నికల అస్త్రంగా మారిన బిల్ట్‌ పరిశ్రమ
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అన్ని రాజకీ య పార్టీ లు బిల్ట్‌ పరిశ్రమను తెరిపిస్తామంటూ వాగ్దానాలు చేస్తు న్నారు. ఆశలు సచ్చిపోయిన కార్మికుల జీవితాల్లో కొత్త ఆశలు రేకెత్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో హాత్‌సే హాత్‌ జోడో యాత్ర నిర్వహించిన పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, పీపుల్స్‌ మార్చ్‌ నిర్వహించి న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే తిరిగి బిల్ట్‌ పరిశ్రమను తెరిపిస్తామంటూ హామీల వర్షం కురిపిస్తున్నారు. నెల రోజుల క్రితం ములుగు జిల్లాలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి హాజరైన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ తెలంగాణలో బీజేపీ అధికా రంలోకి రాగానే బిల్ట్‌ పరిశ్రమను తెరిపిస్తామంటూ వాగ్దానాలు చేశారు. ఇలా అన్ని రాజకీయ పక్షాలకు బిల్ట్‌ పరిశ్రమ ఒక ఎన్నికల అస్త్రంగా మారిందంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement