దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. సెకండ్ వేవ్‌లో వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు పాక్షిక లాక్‌డౌన్‌తో పాటు రాత్రి కర్ఫ్యూలను విధిస్తున్నాయి. ఈ క్రమంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీహార్ వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూతో కూడిన పాక్షిక లాక్ డౌన్ విధించారు. కొన్నింటికి మాత్రం మినహాయింపు ఇచ్చారు. కరోనా కట్టడి కోసం బీహార్ ప్రభుత్వం కఠిన ఆంక్షలకు ఉపక్రమించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు గంట ముందే మూసివేయాలని ఆదేశించింది. విద్యాసంస్థలు, మతపరమైన సంస్థలు మే 15 వరకు పూర్తిగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. పలు కఠిన ఆంక్షలతో పరోక్షంగా పాక్షిక లాక్‌డౌన్‌ను ప్రకటించింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రభుత్వం కరోనా కట్టడికి తీసుకున్న కీలక నిర్ణయాలు…
* బీహార్‌లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ
* మే 15 వరకు విద్యాంస్థలు బంద్
* సినిమా థియేటర్లు, షాపింగ్ మాళ్లు, క్లబ్బులు, పార్కులు మూసివేత
* ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు సాయంత్రం 5 గంటల వరకే అనుమతి
* వైద్యారోగ్య సిబ్బంది సేవలకు గుర్తింపుగా నెల వేతనం బోనస్
* కేసులు అధికంగా ఉన్న చోట కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటిస్తూ కఠిన ఆంక్షలు
* అన్ని జిల్లాలు, నగరాలు, పట్టణాల్లో క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటు
* నిత్యావసర సరుకులు, మాంసం అమ్మే దుకాణాలు, మెడికల్ షాపులకు సాయంత్రం 6 గంటల వరకు అనుమతి
* రెస్టారెంట్లు, హోటళ్లు కేవలం హోం డెలివరీ సేవలకు మాత్రమే అనుమతి
* పెళ్లిళ్లకు 100 మంది, అంత్యక్రియలు 25 మంది మించకూడదు. సభలు, సమావేశాలకు అనుమతి లేదు
* అన్ని మతపరమైన సంస్థలు బంద్
* ప్రజలు గుమికూడే అవకాశం ఉన్న ప్రదేశాల్లో జిల్లా యంత్రాంగాలు 144 సెక్షన్ అమలయ్యేలా చూడాలి
* అంబులెన్స్, ఫైర్, ఈ-కామర్స్ వంటి అత్యవసర సేవలకు ఆంక్షల నుంచి మినహాయింపు
* ఇతర రాష్ట్రాలకు ఉపాధి కోసం వెళ్లిన బీహార్ ప్రజలు తిరిగి వీలైనంత త్వరగా సొంత రాష్ట్రానికి రావాలని నితీశ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
కాగా, బీహార్‌లో సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 8,690 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు సీఎం నితీష్ కుమార్ వెల్లడించారు. ఈ క్రమంలోనే కఠిన ఆంక్షలను విధించారు.