లిక్కర్ మాఫియాతో కుమ్మక్కు అయ్యారని, అక్రమంగా ఆస్తులు సంపాదించారన్న ఆరోపణలపై బిహార్‌లో ఇద్దరు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం మంగళవారం ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఆదిత్య కుమార్, దయాశంకర్‌లను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. 2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఆదిత్య కుమార్ గయా ఎస్‌ఎస్పీగా ఉన్నప్పుడు లిక్కర్ మాఫియాతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వచ్చాయి.
ఈ కేసులో గయాలోని ఫతేపూర్ పోలీస్ స్టేషన్‌లో అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు కావడంతో పోలీసు శాఖ విచారణ జరుపుతోంది. అయితే, ఆదిత్య కుమార్ దోస్తు అయిన అభిషేక్ అగర్వాల్, పాట్నా హైకోర్టు న్యాయమూర్తిగా నటిస్తూ, బిహార్ డీజీపీ ఎస్కే సింఘాల్‌కు తన మొబైల్ ఫోన్‌లో చాలాసార్లు కాల్ చేసి, ఐపీఎస్ అధికారిపై కేసును మూసివేయాలని ఆదేశించడంతో పెద్ద వివాదం చెలరేగింది.
ఆదిత్య కుమార్‌పై కేసును క్లోజ్ చేయడానికిDGP చర్య ప్రారంభించి.. ముఖ్యమంత్రి కార్యాలయానికి అనుమతి కోసం ఫైల్‌ను పంపినప్పుడు ఈ మొత్తం వివాదం వెలుగులోకి వచ్చింది. అభిషేక్ అగర్వాల్‌తో పాటు అతని మరో ముగ్గురు సహచరులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇక.. అభిషేక్ అగర్వాల్ అరెస్ట్ తర్వాత ఏఐజీ (ఐ)గా నియమితులైన ఆదిత్య కుమార్ అండర్‌గ్రౌండ్‌కి వెళ్లిపోయారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేసింది.
పూర్ణె ఎస్పీ దయాశంకర్‌పై కూడా రాష్ట్ర ప్రభుత్వం విరుచుకుపడింది. అతనిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై తక్షణమే సస్పెండ్ చేసింది. రాష్ట్ర విజిలెన్స్ విభాగం అక్టోబర్ 10న దయాశంకర్‌పై కేసు నమోదు చేసింది. విజిలెన్స్ బృందం 71 లక్షల రూపాయలకు పైగా విలువైన అక్రమ ఆస్తులను వెలికితీసిన విజిలెన్స్ బృందం నివాసంతో పాటు అనేక ఇతర ప్రదేశాలలో దాడులు నిర్వహించింది. పూర్ణె ఎస్పీ దయాశంకర్ అక్రమ, బినామీ ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టినట్లు విచారణలో వెల్లడయ్యింది.