బిహార్ లో 144సెక్షన్ అమలులో ఉందని పోలీసులు వెల్లడించారు.శ్రీరామనవమి హింసాకాండ తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతల కోసం చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. బీహార్ లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మార్చి 30 న రాష్ట్రంలో అగ్నిప్రమాదం జరిగినప్పటి నుండి అశాంతిని నియంత్రించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బిహార్ షరీఫ్, ససారం, నలనాడా ప్రాంతాల్లో ఇప్పటికీ మతఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఈ హింసాకాండకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు 106 మందిని అరెస్టు చేశారు. ససారం నుండి 26 మంది, నలంద నుండి 80 మందిని అరెస్టు చేసినట్టు తెలిపారు.
కాగా బిహార్ షరీఫ్, నలంద జిల్లాల్లో శనివారం రాత్రి మళ్లీ ఘర్షణలు చోటుచేసుకోవడంతో అక్కడ 144 సెక్షన్ అమలులో ఉందని పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించాలని ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో బీహార్ పోలీసులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పుకార్లను తోసిపుచ్చారు. కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
బిహార్ షరీఫ్, నలందలో భద్రతా కారణాల దృష్ట్యా పోలీసు బలగాల మోహరింపు కొనసాగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితుల కారణంగా బీహార్ లోని హిందువులు తమ ఇళ్లను విడిచి వెళుతున్నారని పేర్కొంటూ వీడియోతో కూడిన ట్వీట్ పై స్పందించిన రోహ్తాస్ పోలీసులు ఈ ఊహాగానాన్ని నిరాధారమైన-అసంబద్ధమైన పుకారు అని కొట్టిపారేశారు. ఇలాంటి వదంతులను ప్రజలు పట్టించుకోవద్దన్నారు. ఇది పూర్తిగా నిరాధారమైన, అసంబద్ధమైన పుకారు అని వారు ట్వీట్ చేశారు. ఎవరూ తమ ప్రాంతాన్ని వదిలి వెళ్లలేదు. దీనికి సంబంధించిన ఇలా చేసే వారు ఎవరైనా ఉంటే మీరు వారి వివరాలు ఇవ్వండి. ఇలాంటి వదంతులను పట్టించుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ససారంలో పరిస్థితి ప్రశాంతంగా, సాధారణంగా ఉందన్నారు.రామనవమి యాత్ర ఘర్షణల్లో పాల్గొన్న వారందరినీ సీసీ కెమెరాల సహాయంతో గుర్తించామనీ, బీహార్ యంత్రాంగం ఎవరినీ వదిలిపెట్టబోదని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి శక్తి సింగ్ యాదవ్ అన్నారు.