– నాగరాజు చంద్రగిరి, ఆంధ్రప్రభ
ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైలు బోగీల మధ్యలో ఇరుక్కుపోయిన వారిని బయటికి తీస్తున్నారు. ఇక ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది క్షతగాత్రులను ఎయిర్‌లిఫ్ట్ చేసి ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ ప్రమాదంలో తొలుత కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు గూడ్స్ బండిని ఢీకొట్టి పట్టాలు తప్పింది. ఇట్లా 12 పట్టాలు పక్క ట్రాక్‌పైకి దూసుకెళ్లాయి. ఇక.. ఆ లైన్లో వస్తున్న యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలపై పడిపోయిన బోగీలను ఢీకొట్టింది. దీంతో ఆ రైలుకు చెందిన 4 బోగీలు పట్టాలు తప్పి బోల్తాకొట్టాయి. ఈ ప్రమాదంలోి ఇప్పటికే 300 మందికి పైగా మృతి చెందగా, 900 మందికి పైగా గాయపడ్డారు. యశ్వంత్‌పూర్-హౌరా సూపర్‌ఫాస్ట్ పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలను ఢీకొట్టింది. ఇప్పటి వరకు జరిగిన రైలు ప్రమాదాలను పరిశీలిస్తే దేశంలో ఇదే అతిపెద్ద ప్రమాదమని విశ్లేషిస్తున్నారు
దేశంలో అతిపెద్ద రైలు ప్రమాదాలను పరిశీలిస్తే..
• 2011, జూలై 7న ఉత్తరప్రదేశ్‌లోని ఎటాహ్ జిల్లా సమీపంలో ఛప్రా-మథుర ఎక్స్ ప్రెస్ ఓ బస్సును ఢీకొట్టింది. 69 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రైల్వే క్రాసింగ్ వద్ద తెల్లవారుజామున 1:55 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది. రైలు అతివేగంతో వచ్చి.. బస్సును దాదాపు అర కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లింది.
• భారతీయ రైల్వే చరిత్రలో 2012 సంవత్సరం అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ ఏడాది సుమారు 14 రైలు ప్రమాదాలు జరిగాయి. వీటిలో పట్టాలు తప్పడం, ఒకదానికొకటి ఢీకొనడం వంటి ఘటనలు ఉన్నాయి.
• 2012, జులై 30న నెల్లూరు సమీపంలో ఢిల్లీ-చెన్నై తమిళనాడు ఎక్స్‌ప్రెస్ కోచ్‌లో మంటలు చెలరేగడంతో 30 మందికి పైగా చనిపోయారు.
• 2014, మే 26న ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ ప్రాంతంలో గోరఖ్‌పూర్ వైపు వెళుతున్న గోరఖ్‌ధామ్ ఎక్స్‌ప్రెస్ ఖలీలాబాద్ స్టేషన్‌కు సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 25 మంది చనిపోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు.
• 2015, మార్చి 20 న డెహ్రాడూన్ నుండి వారణాసికి వెళ్తున్న జనతా ఎక్స్‌ప్రెస్‌లో పెద్ద ప్రమాదం జరిగింది. ఉత్తర ప్రదేశ్ లోని రాయ్‌బరేలీలోని బచ్రావాన్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఇంజన్, రెండు పక్కనే ఉన్న కోచ్‌లు పట్టాలు తప్పడంతో 30 మందికి పైగా చనిపోయారు. 150 మంది గాయపడ్డారు..
• 2016, నవంబర్ 20న ఇండోర్-పాట్నా ఎక్స్‌ప్రెస్ 19321 కాన్పూర్‌లోని పుఖ్రాయాన్ సమీపంలో పట్టాలు తప్పింది. దాదాపు 150 మంది ప్రయాణికులు చనిపోయారు. మరో 150 మందికి పైగా గాయపడ్డారు.
• 2017, ఆగస్టు 19న హరిద్వార్, పూరి మధ్య నడుస్తున్న కళింగ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లోని ఖతౌలీ సమీపంలో ప్రమాదానికి గురైంది. రైలులోని 14 బోగీలు పట్టాలు తప్పడంతో 21 మంది ప్రయాణికులు చనిపోయారు. 97 మంది గాయపడ్డారు.
• 2017, ఆగస్టు 23న ఉత్తరప్రదేశ్‌లోని ఔరైయా సమీపంలో ఢిల్లీకి వెళ్లే కైఫియత్ ఎక్స్‌ప్రెస్‌లోని తొమ్మిది రైలు కోచ్‌లు పట్టాలు తప్పాయి. దీంతో 70 మంది గాయపడ్డారు.
• 2022, జనవరి 13న పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్‌దువార్‌లో బికనీర్-గౌహతి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. దీంతో 12 కోచ్‌లు పట్టాల మీదనుంచి కిందికి దూసుకెళ్లాయి. 9 మంది చనిపోయారు. 36 మంది గాయపడ్డారు.