హుజురాబాద్, (ప్రభ న్యూస్): ఒకప్పుడు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ఢిల్లీలో యుద్ధమే జరిగేది. హుజురాబాద్ ఉద్దండులు మాజీ ఎంపీ సింగాపురం రాజేశ్వర్ రావు, కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావు, కేతిరి సాయిరెడ్డి, సుదర్శన్ రెడ్డి, పరిపాటి జనార్దన్ రెడ్డి, మాదాడి రాంచంద్రారెడ్డి, లింగంపల్లి వీరారెడ్డి వంటి మహామహులు కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ పడేవారు. హుజురాబాద్ టికెట్ కోసం జాతీయ స్థాయిలో, ఏఐసిసి స్థాయిలో లాబీయింగ్ జరిగేది. హుజురాబాద్ పార్టీ టికెట్ల వ్యవహారాలు పిసిసి నేతలకు, సిఎంలకు కూడా తలనొప్పి వ్యవహారంగా మారిన సందర్భాలు గతంలో ఉన్నాయి. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల టికెట్లు ప్రకటించినా హుజురాబాద్ టికెట్ మాత్రం చివరగా బీ ఫారం గడువుముగిసే రోజునే బహిర్గతమయ్యేది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ లో ఉప ఎన్నిక రావడం, అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహించిన పాడి కౌశిక్ రెడ్డి గులాబీ గూటికి చేరడంతో కాంగ్రెస్ కు అభ్యర్థి కరువయ్యారు.
నిజానికి గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కౌశిక్ రెడ్డి 62 వేలకు పై చిలుకు ఓట్లు తెచ్చుకున్నారు. కానీ ఉప ఎన్నిక టీఆరెస్ – ఈటల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. బీజేపీ అభ్యర్థిగా ఈటల బరిలో ఉండడం, అలాగే టీఆరెస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీచేయడం, చివరకు ఈటల గెలుపొందడం జరిగాయి. ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో ఇక్కడ తన బలాన్ని ప్రదర్శించలేకపోయింది. పిసిసి చీఫ్ ఏ. రేవంత్ రెడ్డి ఈ ఎన్నికపై పెద్దగా దృష్టి పెట్టకపోవడం, స్థానికేతరుడైన వ్యక్తి ని హుజురాబాద్ అభ్యర్థిగా విద్యార్ధి నేత బలమూరి వెంకట్ ను బరిలో నిలిపారు. అయన స్థానికేతరుడు కావడం, చివరి నిమిషంలో ఆయనను అభ్యర్థిగా ప్రకటించడం, పార్టీ ఎన్నికను సవాల్ గా తీసుకోకపోవడంతో గత ఎన్నికల్లో 62 వేల ఓట్లు సాధించిన కాంగ్రెస్ ఈ సారి సుమారు మూడువేల ఓట్లు మాత్రమే సాధించడం గమనార్హం. ప్రస్తుతం 2023 సాధారణ ఎన్నికలకు పార్టీలు ఇప్పటినుండే సన్నద్ధం అవుతున్నాయి.
ప్రస్తుతం బీజేపీ, టీఆరెస్ హుజురాబాద్ నియోజకవర్గంలో బలంగా ఉన్నాయి. ఐతే ఇక్కడి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జిగా బలమూరి వెంకట్ నే కొనసాగిస్తారా? లేక వేరే ఇంఛార్జిని నియమించి బాధ్యతలు అప్పగిస్తారా? కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు అలాగే పార్టీ శ్రేణులను ఒక్కతాటిమీదకు తీసుకువచ్చి సమాయత్త పరిచేందుకు కాంగ్రెస్ అధిష్ఠాయం ఏం చర్యలు తీసుకుంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ అధిష్టానం తీరుతో స్థానిక పార్టీ శ్రేణులు నిరుత్సహానికి గురవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమం కూడా నామమాత్రమైంది. క్యాడర్లో ఉత్సాహం కరువై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా ఎవరిదారి వారు చూసుకునే స్థితి ఏర్పడింది. పార్టీ అధిష్టానం ఇప్పటికైనా దృష్టిపెట్టి పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కృషి చేయాలని, 2023 సాధారణ ఎన్నికల్లో బలమైన పోటీ ఇచ్చే దిశగా అలాగే క్షేత్రస్థాయిలో ఆత్మస్తైర్యం నింపే దిశగా కృషి చేయాలనీ కాంగ్రెస్ కార్యకర్తలు కోరుతున్నారు.