Tuesday, November 26, 2024

Big Story: వ‌రికి ప్రత్యామ్నాయ పంటలు ఏమున్నయ్‌.. మెట్టలో ఏం సాగు చాయాలే!

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి: దేశవ్యాప్తంగా వ్యవసాయోత్పత్తుల దిగుబడులు అనూహ్యంగా పెరిగాయి. వీటిని ఎవరు కొంటారోనన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. తమకు నష్టం వాటిల్ల కుండా ప్రభుత్వమే ఆదుకోవాలని అన్ని రాష్ట్రాల నుంచి రైతులు డిమాండ్‌ చేస్తు న్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా వరినే పండిస్తున్నారు. కేంద్రం ధాన్యాన్ని కాకుండా బియ్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తోంది. రాష్ట్రాలు ధాన్యం కొనుగోలు చేసి మరాడించి బియ్యంగా ఎఫ్‌సీఐకు అందించాల్సి వస్తోంది. ఈ బాధ్యత రాష్ట్రాల దేనని కేంద్రం పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అవసరాలకు అనుగుణంగా వ్యవసాయోత్పత్తి పెరిగింది. అందుబాటులోకొచ్చిన ఆధునిక సాంకేతిక సామర్థ్యం అధిక దిగబడులకు సహకరిస్తోంది. శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు ఏడాది పొడవునా అధిక దిగుబడులిచ్చే విత్తన రకాల అభివృద్ధికి నిరం తరం పాటుపడుతూనే ఉన్నారు. ఆ దిశగా ఇప్పటికే శాస్త్రవేత్తల ప్రయత్నాలు పలు దేశాల్లో సఫలమయ్యాయి. దీంతో వ్యవసాయోత్పత్తుల కోసం విదేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి పలు దేశాలకు తగ్గింది.

భారత్‌లోని 130కోట్ల జనాభా పూర్తి స్థాయిలో ఆహారం తింటే ప్రస్తుతమున్న దిగుబడులు సరిపోతాయా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ దేశంలో పలు కుటుంబాలు ఒక పూటే భోజనం చేస్తున్నాయి. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలన్నీ అర్ధాకలితోనే అలమటిస్తున్నాయి. దేశంలో వ్యవసాయోత్పత్తులు సరిపడే ఉన్నా కొనుగోలు చేసే ఆర్థిక శక్తి వారికి కొరవడింది. వీరందరికీ ఆర్థిక వనరులు అందుబాటులోకొచ్చి రెండుపూటలా కడుపునిండా తినే పరిస్థితి ఏర్పడితే ఇప్పుడున్న ఉత్పత్తులు ఏమూలకు సరిపోవు.

అధిక దిగుబడులు ఇచ్చే వంగడాల్ని శాస్త్రవేత్తలు రూపొందించి రైతులకు అందుబాటులో పెట్టాలి. భూగర్భ జలాల్ని విస్తారంగా వినియోగించే విదానానికి చరమగీతం పాడాలి. పలు అభివృద్ధి చెందిన దేశాల్లో భూగర్భజలాల విచ్చలవిడి వినియోగంపై ఆంక్షలున్నాయి. ఆఖరకు ఆఫ్రికా దేశాల్లో కూడా నదీజలాలు అందుబాటులో ఉన్న చోటే వ్యవసాయం చేయాలి. భూగర్భ జలాల వినియోగానికి ప్రభుత్వాల ముందస్తు అనుమతులు అవసరం. ఇదే విధానాన్ని భారత్‌లో కూడా అమలు చేయాలి. ఇక్కడ మెట్ట ప్రాంతాల్లో భూగర్భజలాలతోనే వరినిసాగు చేస్తున్నారు. ఈ జలాల్ని పైక తెచ్చేందుకు ప్రభుత్వం విద్యుత్‌ను ఉచితంగా అందిస్తోంది. ప్రధానంగా రెండో పంటకు భూగర్భజలాల్నే ఎక్కువ వినియోగిస్తున్నారు. ఇలాంటి చోట్ల ప్రత్యామ్నాయ పంటల వైపు రైతుల్ని ప్రోత్సహించాలి. భూగర్భ జలాల పరిరక్షణ మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలి. అలాగే వరి లేదా గోధుమలకు ప్రత్యామ్నాయంగా అధిక ఉత్పత్తినిచ్చే పంటల్ని అందుబాటులోకి తేవాలి. ఒకసారి పెట్టుబడులు పెడితే 20నుంచి 30ఏళ్ళ పాటు ఫలసాయాన్నిచ్చే తోటల్ని ప్రోత్సహించాలి.

మలేసియా వంటి చిన్న దేశం ప్ర పంచ వ్యాప్తంగా అవసరమైన పామాయిల్‌ను సరఫరా చేస్తోంది. భారత్‌లో కూడా ఆయిల్ పామ్ తోటల పెంపకాలు సాగుతున్నాయి. అయితే వీటిని మరింతగా విస్తరించాలి. మొక్కలు నాటిన మూడో ఏడాది నుంచే ఫలసాయాన్నిచ్చే పామాయిల్‌ వంగడాల్ని రూపొందించి రైతులకందించాలి. అనంతపురం వంటి ప్రాంతాల్లో ఒకప్పుడు చీనీ తోటలు విస్తారంగా పెంచేవారు. ఇక్కడ సాగునీరు అందుబాటులోకి రావడంతో తోటల స్థానంలో వరిసాగుతోపాటు ఇతర పంటల వైపు రైతులు మళ్ళారు. ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో పలు వృక్షజాతులను ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయోత్పత్తుల ఎగుమతులకు ప్రభుత్వాలు అవకాశాలు కల్పించాలి. అప్పుడే రైతులు ఆర్థికంగా వెసులుబాటు పొందుతారు. దేశ జనాభాకు అవసరమైన ఆహారం కూడా అందుబాటులో ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement