హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడు, రాజకీయ నిర్ణయాలు.. కార్యాచరణ సంచలనంగా మారాయి. ఓవైపు బీజేపీపై యుద్ధం చేస్తూ.. నెలరోజులుగా తీవ్ర ఆరోపణలు, ప్రత్యారోపణలతో విరుచుకుపడుతున్న కేసీఆర్.. ఇప్పుడు కాంగ్రెస్ విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు అనూహ్యంగా ఉంటున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేలా ఢిల్లీలో టీఆర్‌ఎస్ అడుగులు వేస్తోందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓ వైపు ఎదురుదాడి ద్వారా బీజేపీని దగ్గరకు తీసుకోవడం ద్వారా కాంగ్రెస్‌ను ఏకకాలంలో దెబ్బతీయాలన్న స్ట్రాటజీతో టీఆర్‌ఎస్ వ్యూహాత్మక ఎత్తులు వేస్తోందన్న అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాల కూటమి భేటికి టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు హాజరయ్యారు. రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీలను బహిష్కరించడంపై తదుపరి కార్యాచరణను ఖరారు చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ విపక్ష నేతల భేటీని నిర్వహించింది.
దీనికి అనూహ్యంగా టీఆర్‌ఎస్ నుంచి కేశవరావు హాజరయ్యారు. ఆయన రాహుల్ గాంధీ పక్కనే కూర్చుని ముచ్చట్లు చెబుతూ కనిపించారు. తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఈ భేటీ తెలంగాణ కాంగ్రెస్ నేతల్ని ఒక్కసారిగా ఆందోళనకు గురిచేసింది. బీజేపీతో కలిసి డ్రామాలు ఆడుతూ.. తమ మధ్యనే పోటీ ఉందని టీఆర్‌ఎస్, బీజేపీ ఓ సీన్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతల సమావేశ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బీజేపీ ఎంపీ అరవింద్ ‘‘దీన్ని ఏమంటారు?’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరోవైపు రేవంత్‌రెడ్డి దీనిపై స్పందిస్తూ టీఆర్‌ఎస్ డబుల్ గేమ్ ఆడుతోందని విమర్శలు గుప్పించారు. టీఆర్‌ఎస్ నేత కేకే మాత్రం తాము బీజేపీకి ఎప్పుడూ దూరమని.. దేశానికి ఉపయోగపడే బిల్లులకు మాత్రమే మద్దతు ఇచ్చామని చెప్పుకొచ్చారు. యాసంగి అజెండాను ముందుపెట్టి.. బీజేపీని డిఫెన్స్‌లో పడేసిన టీఆర్‌ఎస్, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నామంటూ.. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష కూటమి సమావేశానికి హాజరై టీ.కాంగ్రెస్‌ను గందరగోళంలో పడేయడంలో టీఆర్‌ఎస్ మరోసారి సక్సెస్ అయినట్లయింది.
వచ్చే ఎన్నికలే వ్యూహంగా అడుగులు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో తిరిగి అధికారంలోకి రావడంతో పాటు జాతీయస్థాయిలోనూ మంచి భూమిక పోషించాలని భావిస్తున్న టీఆర్‌ఎస్ ఇందుకు తగ్గ స్ట్రాటజీకి ముందునుండే పదునుపెట్టిందని, ఈ క్రమంలోనే.. రోజురోజుకూ యాక్టివ్ అవుతున్న బీజేపీని డిఫెన్స్‌లో పడేయడం, కాంగ్రెస్‌లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేలా కొత్త ప్రణాళికలను టీఆర్‌ఎస్ అమలుచేస్తున్నదన్న చర్చ జరుగుతోంది. ఒకే అంశాన్ని నెలరోజులుగా చర్చలో ఉంచి.. కేంద్రాన్ని, బీజేపీని ఇరుకునపెట్టే యత్నం చేయగా, మరోవైపు బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమించే పార్టీలతో కలిసి జాతీయస్థాయిలో అవసరమైన సందర్బంలో ముందుకుసాగాలని నిర్ణయించింది. పార్లమెంట్ వేదికగా రైతు సమస్యలు, ధాన్యం కొనుగోళ్ళు, కనీస మద్దతు ధరపై టీఆర్‌ఎస్ ఉద్యమిస్తోంది. గల్లీ టు ఢిల్లీ కేంద్రాన్ని ఇరుకునపెడుతూ బీజేపీ నాయకత్వానికి క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తెచ్చి పెడుతోంది.
కేవలం ప్రెస్‌మీట్లకే పరిమితం కాకుండా రాజకీయ పరిశీలకుల అంచనాలకు భిన్నంగా ప్రత్యక్ష ఆందోళనలకు పిలుపునివ్వడం, మహాధర్నాలో స్వయంగా తానే పాల్గొనడంతో సీఎం కేసీఆర్ కార్యాచరణ వెనుక పెద్ద వ్యూహం ఉందని టీఆర్‌ఎస్ ముఖ్యనేతలు అంచనా వేస్తున్నారు. సీఎం కేసీఆర్ వ్యూహాలు ఒక పట్టాన వెంటనే అర్థం కావని.. విశ్లేషణలకు అందవని, కానీ అది గమ్యం చేరి విజయం సాధించాక అందరూ ఆశ్చర్యపోయి చప్పట్లు కొడతారని.. ధాన్యం విషయంలోనూ సీఎం కేసీఆర్ పట్టుదల తెలంగాణ రైతాంగానికి, ప్రభుత్వానికి భవిష్యత్తులో మరింత మేలు చేస్తుందని ఆ పార్టీ ముఖ్యులు అభిప్రాయపడుతున్నారు. హుజూరాబాద్ బైపోల్ ముగిసిన తర్వాత, ధాన్యం ధర్నాల వేడిలోనే.. 19మంది ఎమ్మెల్సీ అభ్యర్ధులను అత్యంత సునాయాసంగా సీఎం కేసీఆర్ ఎంపిక చేశారని, ఇప్పటికపుడు ఇతర ఎన్నికలు ఏవీ లేవని.. కేసీఆర్ నిర్దేశించిన ఎజెండా చుట్టే రాష్ట్ర రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయన్న చర్చను ప్రస్తావిస్తున్నారు. తాజా వార్‌ను టీఆర్ ఎస్ మరింత ముందుకు తీసుకెళ్తుందా? ఇంకా ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..