Thursday, November 21, 2024

Big Story: హ‌స‌నాంబ‌కు వింత లేఖలు.. వామ్మో కోరికలు మామూలుగా లేవుగా..

కర్నాటకలోని హసన్ ఏరియా. అక్కడ హసనాంబ అమ్మవారి ఆలయం ఉంది. ఆ దేవాలయానికి చాలా ప్రాముఖ్యతతో పాటు ఓ ప్రత్యేకత ఉంది. ఏడాది పొడవునా అమ్మవారి గుడి క్లోజ్ అయి ఉంటుంది. కేవలం ఏడాదికి తొమ్మిది రోజులు మాత్రమే తెరుస్తారు. ఆ తొమ్మిది రోజులు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున క్యూ కడతారు. అయితే ఈసారి మాత్రం చాలా మంది అమ్మవారికి లేఖలు రాసి.. వారి కోరికలను వెలిబుచ్చారు.. హుండీల్లోనుంచి బయటపడ్డ లేఖల్లో ఏముందంటే..

ఆ సమయంలో కిలోమీటర్ల మేర క్యూ లైన్‌లు ఉంటాయి. ఈ ఏడాది అక్టోబరు 28 నుంచి నవంబరు 6 వరకు భక్తులకు అమ్మ‌వారి ద‌ర్శ‌నం కల్పించారు. ఆ తర్వాత ఆలయాన్ని తిరిగి మూసివేశారు. హసనాంబ గుడిని మూసేసిన త‌ర్వాత‌ హుండీ లెక్కింపు ప్రారంభిచారు ఆల‌య అధికారులు. సాధారణంగా హుండీలో భక్తులు సమర్పించిన నగదు, ఇతర కానుకలు ఉంటాయి. కానీ, ఈసారి డబ్బు కంటే భక్తుల నుంచి వ‌చ్చిన‌ లేఖలే ఎక్కువగా క‌నిపించ‌డం అక్క‌డ‌ హాట్ టాపిక్‌గా మారింది.

ఇంత‌కీ ఆ లేఖల్లో ఏముందంటే..
”అమ్మా.. మాయందు దయ ఉంచి హోళెనరసాపుర నియోజకవర్గాన్ని కాపాడండి. ఇప్పుడున్న ఎమ్మెల్యేను ఓడించండి. మాకు కొత్త ఎమ్మెల్యే కావాలి. హెచ్‌డీ రేవణ్ణ, ఆయన కుటుంబ సభ్యులు ప్రజల రక్తాన్ని తాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఫ్యామిలీ నుంచి ఎవరూ గెలవకుండా చూడాల్సిన బాధ్యత మీదే.” అని ఓ లేఖలో రాసి ఉంది. మ‌రో లేఖ‌లో.. తనకు SSLC పరీక్షల్లో 90శాతం మార్కులు వచ్చేలా దీవించాలని ఓ విద్యార్థి అమ్మవారిని కోరారు.

ఆరేళ్ల క్రితం గుండె మార్పిడి.. జీవితమే తలకిందులు..
హసన్‌లోని 35వ వార్డుకు చెందిన ఓ వ్యక్తి అమ్మవారిని వింత కోరిక కోరాడు. తమ వార్డుల్లో రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయని.. రోడ్లపై గుంత‌లు పూడ్చేలా అధికారుల‌కు క‌నువిప్పు క‌లిగించాల‌ని లేఖరాసి హుండీలో వేశాడు. తాను అనుకున్నది జరిగితే రూ.5వేలు సమర్పిస్తానని మరో భక్తుడు లేఖరాశాడు. ఐతే అతడి కోరిక ఏమిటన్నది లేఖలో పేర్కొనలేదు. కానీ, తన కోరిక తీరితే మాత్రం మొక్కను చెల్లించుకుంటానని వేడుకున్నాడు.

మ‌రో లేఖ‌లో.. తన భర్త మద్యానికి బానిసయ్యాడని.. ఎలాగైనా తాగుడు అలవాటు మానేలా చేయాలని ఓ మహిళ హసనాంబను కోరింది. ఓ యువతి ఏకంగా రక్తంతో రాసిన లేఖను హుండీలో వేసింది. తన ప్రియుడితో వివాహం జరిగేలా ఆశీర్వదించాలని అమ్మవారిని మొక్కుకుంది. ఇవే కాదు.. ఇంకా చాలా లేఖలున్నాయి.

- Advertisement -

జాబ్‌ రావాలని ఒకరు.. మ్యారేజ్ కావాలని మరొకరు.. సొంత ఇల్లుకోసం ఇంకొకరు.. ఇలా చాలామంది లేఖలు రాసి హుండీలో వేశారు. ఇప్పటికే ఉద్యోగాలున్న వారు కూడా ప్రమోషన్ రావాలని అమ్మవారిని కోరారు. మరికొందరమో తమ పిల్లలు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని తల్లికి మనసారా మొక్కుకున్నారు. మరి వీరందరి కోరికలను హసనాంబ అమ్మవారు తీర్చుతారో లేదో గానీ.. హుండీలోని లేఖలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి:

https://twitter.com/AndhraPrabhaApphttps://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement