Friday, November 22, 2024

Big Story: ఓసారి ఢిల్లీకి రండి.. కాంగ్రెస్ స్టేట్ లీడ‌ర్ల‌కు హై క‌మాండ్ పిలుపు..

కాంగ్రెస్ పార్టీలో హుజూరాబాద్ బై ఎల‌క్ష‌న్‌ ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. కొద్ది రోజులుగా రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతల మధ్య హుజూరాబాద్ పంచాయితీ ఒడ‌వ‌ని ముచ్చ‌ట‌గా కొన‌సాగుతూనే ఉంది. ఈ ఓటమికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వైఖరే కారణమని కొందరు ఆరోపిస్తుంటే.. పార్టీ కోసం పనిచేయని నేతలు రేవంత్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఇంకొంద‌రు లీడ‌ర్లు వాదిస్తున్నారు.

అసలు హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు అంత తక్కువ ఓట్లు రావడానికి కారణమేంటో తెలుసుకోవడానికి ఓ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని టీపీసీసీ పొలిటికల్ ఎఫైర్ కమిటీ భేటీలో నిర్ణయించారు. ఈ నివేదిక టీపీసీసీకి వచ్చిందా ? అధిష్టానానికి చేరిందా? అన్న విషయంలో మాత్రం ఇంకా ఎవరికీ క్లారిటీ లేదు. కాగా, హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై కాంగ్రెస్ హైకమాండ్ కూడా సీరియస్ అయిన‌ట్టు తెలుస్తోంది. మరీ ఇంత దారుణమైన ఫలితం ఎందుకు వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ విష‌యంపై చర్చించేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు అభ్యర్థిగా బరిలోకి దిగిన బల్మూరి వెంకట్‌ను ఈ నెల 13న ఢిల్లీ రావాల్సిందిగా హై క‌మాండ్ నుంచి పిలుపు వ‌చ్చింది.

అయితే.. కాంగ్రెస్ హైకమాండ్ ఈ ముగ్గురు నేత‌ల‌తో ఏం చ‌ర్చించ‌నుంది? వీళ్లు అధిష్టానానికి ఎలాంటి సంజాయిషీ ఇచ్చుకుంటారు? అనే అంశం తెలంగాణ పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లో ఇంట్ర‌స్టింగ్ డిబేట్ జ‌రుగుతోంది. మరోవైపు తెలంగాణలోని కొందరు కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారని సమాచారం. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో సరిగ్గా శ్రద్ధ పెట్టలేదని.. ఆ కారణంగానే ఈ రకమైన దారుణమైన ఫలితాలు వచ్చాయని కొందరు లీడ‌ర్లు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

- Advertisement -

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement