Wednesday, November 20, 2024

Big Story: దేశంలో 10శాతం మంది ద‌గ్గ‌ర 57శాతం ఆదాయం.. వ‌ర‌ల్డ్ ఇనీక్వాలిటీ రిపోర్ట్ వెల్ల‌డి..

రోజువారీ ఆదాయం లేక చాలా మంది తిండికి కూడా నోచుకోవ‌డం లేదు. దేశంలో ఆర్థిక అస‌మాన‌త‌లు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. క‌రోనా దెబ్బ‌కు ఎన్నో కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. నేటికి ప‌ని దొర‌క్క ల‌క్ష‌లాది కుటుంబాలు బిక్కు బిక్కుమంటూ గ‌డుపుతున్నాయి. సాధార‌ణ పౌరుల నుంచి మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర‌కు క‌రోనాతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనికి తోడు చేసిన పూట గడవడానికి అప్పులు, ప్రైవేట్ సంస్థ‌ల నుంచి తీసుకున్న రుణాలు చెల్లించ‌లేక‌.. ఈఎంఐలు క‌ట్ట‌లేక నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. దీనికి కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యామ్నాయ చ‌ర్య‌లు మాత్రం చేప‌ట్ట‌లేదు. కానీ, సంప‌న్నుల‌కు ప‌న్నుల రూపంలో రాయితీలిచ్చి ఉన్న‌వారినే ఆదుకుంటున్నారనే అప‌వాదు మూటగట్టుకుంది.. ఇది ఇప్పుడు అంద‌రినోటా వినిపిస్తున్న మాట..

కాగా, దేశంలో అస‌మాన‌త‌లు తీవ్రంగా ఉన్న దేశాల లిస్టులో ఇండియా టాప్ మోస్ట్ లిస్ట్ లో ఉందని వ‌ర‌ల్డ్ ఇనీక్వాలిటీ రిపోర్ట్ 2022 వెల్ల‌డించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఉన్న ఇండియాలో రోజు రోజుకూ పేద‌రికం పెరుగుతోంద‌ని చెప్పింది. 2021 జాతీయ ఆదాయంలో ఐదో వంతు కేవలం ఒక శాతం మంది దగ్గరే ఉన్నట్లు తెలిపింది. ధనవంతుల జాబితాలో ఉన్న తొలి 10 శాతం మంది చేతిలో 57శాతం ఆదాయం పోగుప‌డి ఉంది..

తొలి 1 శాతం మంది ద‌గ్గ‌ర 22శాతం సంప‌ద ఉన్నట్లు పేర్కొంది. భారత్‌లో వయోజనుల సగటు తలసరి ఆదాయం రూ.2,04,200గా ఉందని తెలిపింది. జాబితాలో కిందున్న 50శాతం కుటుంబాల వద్ద 13శాతం సంప‌దే ఉందని ఇనీక్వాలిటీ సూచీ పేర్కొంది. దేశంలో మ‌హిళా లేబ‌ర్ల ఆదాయ వాటా 18శాత‌మ‌ని తెలిపింది. అయితే.. ఆసియా దేశాల్లో మ‌హిళా లేబ‌ర్ల ఆదాయ వాటా 22 శాతం (చైనా కాకుండా) క‌న్నా త‌క్కువ‌ని చెప్పింది. ప్ర‌పంచంలోని అతి త‌క్కువ వాటాల్లో ఇదీ ఒక‌ట‌ని వివ‌రించింది.

top 10 richest persons in india..

1985 తర్వాత ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆర్థిక విధానాలు ఆదాయ, సంపద విషయంలో అసమానతల్ని పెంచాయని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా పైన ఉన్న ఒక శాతం మంది ఆర్థిక సంస్కరణల వల్ల భారీ లబ్ధి పొందారని ఇనీక్వాలిటీ స‌ర్వే వెల్ల‌డించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement