Monday, November 18, 2024

Big Story: కవితపై ఎంపీటీసీల సంఘం ప్రతినిధి పోటీ.. నిజామాబాద్ లో ట్విస్ట్ ఉంటుందా?

తెలంగాణలోని 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూలు విడుదలైంది. ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్ , నిజామాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి ఒక్కో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అవ్వగా, కరీంనగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి నుంచి రెండేసి ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. నామినేషన్లకు చివరి రోజు కావడంతో మంగళవారం అంతటా నామినేషన్లు కూడా వేశారు. రేపు (బుధవారం) స్ట్రూటినీ జరగనుంది. ఇక వీటికి డిసెంబర్ 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.

అయితే.. ఈ స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) డిసైడ్ అయ్యింది. ఎందుకంటే ఆ పార్టీకి ఏ మాత్రం బలం లేదు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కానీ. అంతో ఇంతో బలం ఉన్న కాంగ్రెస్ మాత్రం తమ అభ్యర్థులను బరిలో దింపాలనే నిర్ణయించుకుంది . అలా అని.. కాంగ్రెస్‌కు పూర్తి స్థాయిలో బలం లేదనే టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం 12 స్థానాల్లో ఉన్న బలాబలాలని పరిశీలిస్తే.. 12 చోట్ల టీఆర్ఎస్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా క్రాస్ ఓటింగ్ జరిగినట్లైతే.. తమకు బెనిఫిట్ అవుతుందనే కోణంలో కాంగ్రెస్ నేతలున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆ పార్టీ కొన్ని చోట్ల అభ్యర్ధులని బరిలో దింపింది. మెదక్‌ స్థానం నుంచి సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, ఖమ్మం నుంచి స్థానిక నేత రాయల నాగేశ్వర్‌రావు కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు. అలాగే నల్గొండ నుంచి శ్రీనివాస్ రెడ్డిని, వరంగల్ నుంచి వాసుదేవరెడ్డి కూడా బరిలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక నిజామాబాద్‌లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ను పోటీకి దింపుతున్నట్టు ప్రకటించినా చివరికి కాంగ్రెస్ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.. నిజామాబాద్‌లో టీఆర్ఎస్ తరుపున సీఎం కేసీఆర్ తనయ, కల్వకుంట్ల కవిత పోటీ చేస్తున్నారు. అక్కడ టీఆర్ఎస్‌కు పూర్తి బలం ఉంది కాబట్టి, కవిత గెలుపు నల్లేరు మీద నడకే అని తెలుస్తోంది.. కానీ, నిజామాబాద్ జిల్లాకు చెందిన అమ్రాద్ ఎంపీటీసీ భర్త శ్రీనివాస్ ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేశారు. ఎంపీటీసీల హక్కుల కోసం చాలా కాలంగా శ్రీనివాస్ పోరాడుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు కాస్త క్రాస్ ఓటింగ్ చేస్తే మాత్రం రిజల్ట్ మారిపోయే అవకాశం ఉందని సమాచారం. మరి నిజామాబాద్‌లో ఏమన్నా ట్విస్ట్ ఉంటుందేమో చూడాలి అంటున్నారు పరిశీలకులు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement