Friday, November 22, 2024

Big Story: పోస్టల్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌.. 10 ఏళ్లు దాటిన మైన‌ర్లకూ ఖాతా..

పోస్టాఫీస్ మంత్లీ ఇన్ కమ్ స్కీమ్ అందరికీ అందుబాటులో ఉంటుందనే చెప్పవచ్చు.  ఈ స్కీమ్ 10 ఏండ్లు దాటిని పిల్లల పేరు మీద కూడా ప్రారంభించవచ్చు. అయితే పోస్టాఫీస్ పొదుపు ప‌థ‌కాల్లో న‌ష్టపోతామనే భయం ఉండదు. నెల నెలా కచ్చితమైన‌ ఆదాయం కోరుకునే వారు పోస్టాఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ పథకంలో పొదపు చేసుకోవచ్చు.

సీనియ‌ర్ సిటిజ‌న్లు, రిటైర్డ్ ఉద్యోగుల‌కు ఈ ప‌థ‌కం స‌రిగ్గా స‌రిపోతుంది. క‌నీసం 1000 రూపాయలు కూడా డిపాజిట్ చేయ‌వ‌చ్చు. ఈ ప‌థ‌కం ప్రారంభించిన స‌మ‌యంలో ఉన్న వ‌డ్డీరేటు.. పెట్టుబ‌డి వ్యవ‌ధిలో మొత్తం వ‌ర్తిస్తుంది. అందువ‌ల్ల కచ్చిత‌మైన రాబ‌డి కూడా ఉంటుంది. ఈ పథకం గురించిన కొన్ని ముఖ్య విష‌యాలు చదివి తెలుసుకుందాం..

అర్హత‌: దేశ పౌరులైన ప్రతి ఒక్కరూ పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఖాతాఓపెన్ చేయొచ్చు. ఖాతాను వ్యక్తిగ‌తంగా గానీ, ఇద్దరు లేదా ముగ్గురు జాయింట్‌గా గానీ ఓపెన్ చేయొచ్చు. 10 ఏళ్ల పైబ‌డి వ‌య‌సున్న పిల్లల పేరుపై కూడా ఖాతాను తెరిచే చాన్స్ ఉంది. పిల్లల పేరుపై ఖాతా తెరిస్తే, వారికి 18 ఏండ్లు నిండిన త‌ర్వాత ఖాతా ట్రాన్స్ ఫర్  చేసి, మెచ్యూరిటీ మొత్తాన్ని అంద‌జేస్తారు.

డిపాజిట్ మొత్తం: ఈ ప‌థ‌కంలో డిపాజిట్లు 1000 రూపాయల నుంచి ప్రారంభించొచ్చు. వ్యక్తిగ‌త ఖాతాదారులు గ‌రిష్ఠంగా రూ.4.50 ల‌క్షలు, ఉమ్మడి ఖాతాదారులు గ‌రిష్ఠంగా రూ.9 ల‌క్షల వర‌కు ఇందులో పెట్టుబ‌డి పెట్టొచ్చు. ముగ్గురు వ్యక్తులు జాయింట్‌గా ఖాతా తీసుకున్నప్పటికీ గ‌రిష్ఠంగా రూ.9 ల‌క్షలే డిపాజిట్ చేయ‌గ‌ల‌రు. ఉమ్మడి ఖాతాలో ఖాతాదారులంద‌రికీ స‌మానంగా వాటా ఉంటుంది.

మెచ్యూరిటీ: ఇందులో  ఐదేండ్ల లాక్‌-ఇన్ పీరియ‌డ్ ఉంటుంది. ఒక‌వేళ ఖాతాదారుడు మెచ్యూరిటీకి ముందే చనిపోతే ఖాతా మూసివేయ‌వ‌చ్చు. నామినీకి ఖాతాలో ఉన్న‌ మొత్తాన్ని చెల్లిస్తారు. డ‌బ్బు వాప‌సు చేసే ముందు నెల వ‌ర‌కు వ‌డ్డీ చెల్లిస్తారు.

- Advertisement -

గడువుకు ముందే ఖాతా మూసివేస్తే: డిపాజిట్‌ చేసిన ఏడాది తర్వాత ఖాతాను మూసివేసి నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఏడాది తర్వాత, మూడేళ్లకు ముందు ఖాతా మూసివేయాలనుకుంటే డిపాజిట్‌ మొత్తం సొమ్ముపై 2 శాతం కోత విధిస్తారు. మూడేళ్లు నిండి, ఐదేళ్లు పూర్తి కాకపోతే డిపాజిట్‌పై 1 శాతం కోత విధిస్తారు.

వ‌డ్డీ: ఈ ప‌థ‌కంలో లాక్‌-ఇన్ పీరియ‌డ్ ఉంటుంది కాబ‌ట్టి పెట్టుబడి సమయంలో ఉన్న వార్షిక వ‌డ్డీ రేటు మెచ్యూరిటీ వ‌ర‌కు వ‌ర్తిస్తుంది. అందువ‌ల్ల నెల నెలా వ‌చ్చే వడ్డీ స్థిరంగా ఉంటుంది. ఉదాహరణకు, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ వడ్డీ రేటు ప్రస్తుతం సంవత్సరానికి 6.60 శాతంగా ఉంది. ఇప్పుడు ఖాతా తెరిస్తే మెచ్యూరిటీ పీరియ‌డ్ వ‌ర‌కు ఇదే వార్షిక వ‌డ్డీ రేటు వ‌ర్తిస్తుంది.

ఖాతా తెరిచిన తేదీ నుంచి ఒక నెల పూర్తయిన తర్వాత వ‌డ్డీ చెల్లింపులు ప్రారంభించి మెచ్యూరిటీ వరకు కొన‌సాగిస్తారు. పెట్టుబడిదారుడు నెల నెలా వ‌డ్డీని క్లెయిమ్ చేయాలి. ఇండియా పోస్ట్ వెబ్‌సైట్ ప్రకారం, ప్రతి నెలా చెల్లించిన‌ వడ్డీని ఖాతాదారుడు స్వీకరించకపోతే, అలాంటి వడ్డీపై ఎలాంటి అదనపు వడ్డీ ల‌భించ‌దు. ఈ మొత్తాన్ని పొదుపు ఖాతా లేదా ఆర్‌డీ ఖాతాకు మ‌ళ్లించ‌వచ్చని కోరొచ్చు. ఇందుకు త‌గిన సూచ‌న‌లు పోస్టాఫీసు అధికారుల‌కు ఇవ్వాల్సి ఉంటుంది. వ‌డ్డీ మొత్తాన్ని ఆర్‌డీ ఖాతా తెరిచి.. నెలనెలా అందులో జ‌మ‌య్యేలా చూసుకుంటే ఈ వ‌డ్డీ మొత్తంపై అద‌న‌పు వ‌డ్డీ ప్రయోజ‌నాన్ని పొందొచ్చు. పోస్టాఫీస్ ఆర్‌డీ ఖాతాకు కూడా 5 సంవ‌త్సరాల కాల‌ప‌రిమితి ఉంటుంది. ఆర్‌డీపై పోస్టాఫీస్ ప్రస్తుతం అందిస్తున్న వ‌డ్డీరేటు 5.8 శాతం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement