హుజురాబాద్ ఎలక్షన్స్ తర్వాత తెలంగాణలో టీఆర్ ఎస్ దూకుడు పెంచింది. ఇంతకాలం కాస్త నెమ్మదిగా ఉన్న నేతలు.. యాక్షన్‌లోకి దిగారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనాన్ని నిలదీసేలా పలుమార్లు సీఎం కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్రానికి రావాల్సిన ఫండ్స్ విషయంలోనూ నిలదీశారు. పెట్రోలు, డీజిల్ ధరల అంశాన్ని ప్రస్తావిస్తూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. ప్రధాని మోడీ ప్రజలను దోచుకునేలా సుంకాలు పెంచేశారని, రాష్ట్రాలకు రావాల్సిన ఫండ్స్ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. అయితే బీజేపీ నేతలు పెట్రోలు సుంకం తగ్గించాలని డిమాండ్ చేస్తే.. తాము ఒక్క పైసా పెంచనప్పుడు ఎందుకు తగ్గించాలో చెప్పాలని రివర్స్ పంచ్ వేశారు కేసీఆర్..
కాగా, ఈ మధ్య కాలంలో వడ్ల కొనుగోలు విషయంలో టీఆర్ ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా సాగుతోంది వ్యవహారం. రైతుల పక్షాన నిలబడ్డట్టు మాట్లాడుతున్న బీజేపీ ఆందోళనలు చేస్తూ.. టీఆర్ ఎస్‌ను టార్గెట్ చేస్తోంది. అయితే కేంద్రం వడ్లు కొనను అంటేనే తాము యాసంగిలో వరి పంట సాగుచేయొద్దని చెబుతున్నామని, కేంద్రం కొంటామంటే మరింత సాగు చేసేలా చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ పలుమార్లు చెప్పారు.
రైతులు అంశాన్ని టీఆర్ ఎస్, బీజేపీతోపాటు కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కూడా రాజకీయంగా తీసుకున్నాయి. ఎవరికి వారు ఆందోళనలు చేస్తూ.. వడ్లు కొనుగోలు చేయాలని నిరసనలకు దిగుతున్నారు. ఈ క్రమంలో నల్లగొండ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని అడ్డుకుని కొంతమంది రాళ్లు విసిరారు. దాన్ని ఆ పార్టీ నేతలు టీఆర్ ఎస్ వర్గాలు రాళ్లు రువ్వాయని ప్రచారం చేసుకుంటూ మైలేజ్ పెంచుకోవాలని చూస్తున్నారని టీఆర్ ఎస్ నేతలంటున్నారు. ఇట్లాంటి డ్రామాలన్నీ బండి సంజయ్‌కు కొట్టిన పిండి అని.. తానే దాడి చేయించుకుని డ్రామాలాడడం మొదటి నుంచి ఉందని మండిపడుతున్నారు.
ఈ రోజు తెలంగాణ భవన్‌లో భేటీ అయిన టీఆర్ ఎస్ అధినేత మున్మందు చేపట్టే కార్యక్రమాలు.. కేంద్రంపై పోరాడాల్సిన తీరు.. ఢిల్లీలో ఆందోళనలకు సంబంధించిన అంశాలపై పార్టీ నేతలు, శ్రేణులకు దిశా నిర్ధేశం చేశారు. ఈ నెల 29న ఢిల్లీలో రైతు దీక్షకు అంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు గులాబీ దళపతి.
ఇట్లా రైతుల కోసం చేపడుతున్న పోరాటాలు అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు టర్న్ తీసుకుని పాలిటిక్స్ కేంద్రంగా సాగుతున్నాయి. దీంతో యావత్ తెలంగాణ అంతా రచ్చ రచ్చ అవుతోంది.. కాగా, డీజిల్, పెట్రలో ధరల పెంపు అంశం.. నిత్యావసరాల ధరల పెంపు, వంట నూనెల ధరల పెంపు, గ్యాస్ సిలెండర్ ధరల పెంపు.. వంటివి ఈ ధర్నాలు, ఆందోళనలతో మరుగునపడిపోయాయి. వీళ్ల లొల్లి నడుమ ప్రజలు ప్రధాన సమస్యలను మరిచిపోయారనే చెప్పవచ్చు..
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily