ఉరుకులు పరుగుల జీవితం.. పడకమీది నుంచి లేచింది మొదలు.. మళ్లీ బెడ్ రూమ్ కి చేరేదాకా స్ట్రెస్.. టెన్షన్స్.. నేటి ఆధునిక జీవనశైలితో చాలామందిని హెల్త్ ఇష్యూస్ వెంటాడుతున్నాయి. దీంతో తక్కువ యస్సులోనే పలు రకాల వ్యాధులకు, అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే ఈ తరహా జీవనశైలి మార్చుకోకపోతే ప్రాణాంతకమైన జబ్బులు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ హెచ్చరికలేంటో చదివి తెలుసుకుందాం.
ఏజ్ పెరుగుతున్న కొద్ది చాలా మందికి హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. అయితే వీటికి తోడు ఫుడ్, వర్కింగ్ స్టైల్ తో కూడా కొన్ని జబ్బులు వస్తాయంటున్నారు డాక్టర్లు. ప్రధానంగా షుగర్, హైపర్ టెన్షన్, కేన్సర్, పెరాలసిస్, గుండె జబ్బులు వీటిలో కీలకంగా మారుతున్నాయి. ముఖ్యమంగా మానసిక రుగ్మతలు ఎక్కువవుతున్నాయి. వీటన్నింటికీ కారణం ఆధునిక జీవనశైలే అంటున్నారు వైద్య నిపుణులు.
గతంతో పోలిస్తే ఈ మధ్యకాలంలో షుగర్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. మెరుగైన ట్రీట్ మెంట్ అందుబాటులో ఉన్నా చిన్న వయస్సులోనే బాధితులుగా మారడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో నే గత ఐదు నెలల్లో 1.30 లక్షల మందికి, తెలంగాణలో దాదాపు 3.25లక్షలకు పైగా అవుట్ పేషెంట్లు కేవలం ఆధునిక జీవనశైలి రుగ్మతలతో బాధపడుతున్నారని ఓ సర్వేలో తేలింది. 2021 నుంచి వివిధ రకాల హాస్పిటళ్లలో నమోదవుతున్న కేసుల్ని బట్టి ఈ గణాంకాలు లెక్కగట్టారు.
అయితే.. అన్ని సమస్యలకు ప్రధాన కారణం ఒత్తిడి మాత్రమేనని తెలుస్తోంది. ఉద్యోగాలు, చదువుల్లో ఉన్నవారు ఎక్కువగా డిప్రెషన్ కు గురవుతున్నారు. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ అత్యధికగా 51 వేలమంది మానసిక జబ్బులతో బాధపడుతున్నారని వెల్లడైంది. మరోవైపు కోవిడ్ కూడా ఈ ప్రెషర్ కు అదనంగా కారణమైందనేది వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా గుండె జబ్బులు, షుగర్, హైపర్ టెన్షన్ వంటి వ్యాధుల నియంత్రణ అనేది మన చేతుల్లోనే ఉంటుందని, రోజువారీ యాక్టివిటీస్ ను బట్టే ఇట్లాంటి జబ్బులు వస్తుయంటున్నారు డాక్టర్లు. సరైన వ్యాయామం లేకపోవడంతో ఒత్తిడిని తట్టుకోలేక..35 ఏళ్లలోపు యువకులు సైతం హార్ట్ స్ట్రోక్ కు గురవుతున్నట్టు స్పష్టమవుతోంది. అదే సమయంలో డయాబెటిక్ కేసులు ఆహారపు అలవాట్ల కారణంగా పెరుగుతున్నాయని అర్ధమవుతోంది.
అందుకే తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఈ తరహా వ్యాధులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మధుమేహం, గుండెపోటు జబ్బుల్ని ప్రాథమిక దశలోనే కనుగొనేందుక వీలుగా ప్రత్యేక నిపుణుల్ని నియమిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్ చేస్తూ అవగాహన కల్పించేదుకు ప్రయత్నిస్తున్నారు డాక్టర్లు. అర్బనైజేషన్ నేపధ్యంలో వస్తున్న ప్రతికూల మార్పులు, ఆహారపు అలవాట్లు, వ్యాయామం లోపించడం అన్నింటికీ మూలకారణంగా ఉందని వైద్య నిపుణుల సూచన. అందుకే ఆహారపు అలవాట్లను ముఖ్యంగా జీవనశైలిని మార్చుకోవాలని సలహా ఇస్తున్నారు. ఒత్తిడిని అధిగమించేందుకు వ్యాయమం అలవాటు చేసుకోవాలంటున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..