ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ వైరస్ పుట్టుకతోనే రాజకీయం నేర్చుకుంది. కరోనా వైరస్ కు పుట్టినిల్లు చైనా అన్న సంగతి అందరికీ తెలిసిందే. అక్కడి నుంచి తన పరాక్రమాన్ని చూపిస్తూ అన్ని దేశాలపై దండెత్తి గడగడలాడించింది. తర్వాత కొన్ని వందల వేరియంట్ లుగా మారి ముప్పతిప్పలు పెట్టింది. దీనంతటికీ కారణం చైనా కుయుక్తేనని అప్పట్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బహిరంగంగానే నిందించారు. వైరస్ లీక్ సంగతి కావాలనే చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ దాచిపెట్టి ప్రపంచ దేశాల ఉసురు పోసుకున్నాడని విరుచుకుపడ్డారు.
ఇదంతా గతం… ఇప్పుడు కరోనా వేరియంట్ లకు గ్రీకు ఆల్ఫబెట్ పేర్లు పెడుతున్నారు. ఇప్పటివరకు ‘ఆల్ఫా’ , ‘బీటా’, ‘గామా’, ‘డెల్టా’… ఇలా ‘మ్యూ’ వరకూ పెట్టారు. ప్రస్తుత కరోనా వైరస్ రకానికి ‘ను’ లేదా ‘జి’ అని పేరు పెట్టాలి. అయితే చైనా ప్రీమియర్ పేరును ‘జి’ పోలి ఉంది. ఆయన ఆగ్రహిస్తాడని రెండు అక్షరాలు వదిలేసి ఒమిక్రాన్ పేరు పెట్టారు. ఇక్కడే రాజకీయం చోటుచేసుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ పేర్లు పెడుతోంది. దాని ప్రస్తుత డైరక్టర్ జనరల్ టెడ్రోస్ అథోనామ్ గెబ్రయోసిస్. ఆయన ఇంతకుముందు ఇథియోపియా దేశ మంత్రి. ఇథియోపియాలో చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది. అందుకు చైనా ప్రీమియర్ ముందు చూపుంది. టెడ్రోస్ సహకారం ఉంది.
ప్రతిఫలం… ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ పదవి. గతంలో కరోనా వైరస్ చైనాలో ఎక్కడ, ఎలా, ఏవిధంగా పుట్టిందో తెలుసుకోవడానికి ట్రంప్ ప్రోద్బలంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక నిపుణుల బృందాన్ని చైనా పంపింది. అది జి జిన్ పింగ్ ఆగ్రహానికి కారణమైనది. పావులు కదిపారు. చాలా పరిణామాలు సంభవించాయి. ట్రంప్ ఇంటికెళ్లాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతానికి వస్తే టెడ్రోస్ ఆవిధంగా రుణం తీర్చుకున్నాడు. అదండి రాజకీయం. సరే మీడియా ఊరుకుంటుందా? ఉతికి ఆరేస్తోంది!
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..