Saturday, November 23, 2024

Big Story: ఎర్త్‌కి మరో డేంజ‌ర్‌.. దూసుకొస్తున్న ఆస్టరాయిడ్‌.. సైడ్ అవుతుందా.. షేక్ చేస్తుందా?

కరోనా మహమ్మారి, ప్రకృతి విలయాలు… చాలదన్నట్టు భూమండ‌లానికి మరో ముప్పు పొంచి ఉంది. ఈ ఉపద్రవాల‌కు తోడు అతి వేగంతో భూమి వైపు ఓ ఆస్టరాయిడ్ దూసుకొస్తోంది. నాసా (National Aeronautics and Space Administration) చెబుతున్న డెడ్‌లైన్‌లోగా ఏం జరగనుందనేది ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల ప్రశ్నగా మారింది.

వ‌రల్డ్ వైడ్‌గా టెన్షన్ పెడుతున్న‌ కరోనా మహమ్మారి (Corona Pandemic) నుంచి జ‌నం తేరుకోకముందే మరో ప్రమాదం తప్పేటట్టు లేదు. భూమి వైపుకు దూసుకొస్తున్న ఆస్టరాయిడ్స్ రూపంలో ఓ ప్రమాదం వస్తోంది. అదృష్టవశాత్తూ చాలా వరకూ గ్రహశకలాలు భూమికి అత్యంత సమీపం నుంచి వెళ్లిపోతున్న సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి.

కానీ, ఈసారి దూసుకొస్తున్న గ్రహ శకలం భూమిని ఢీ కొట్టవచ్చని చెబుతున్నారు స్పేస్ సైంటిస్టులు. ఈ ఆస్ట్రాయిడ్‌ భూమికి దగ్గరగా వచ్చి పోతుందా? లేదా ఢీ కొడుతుందా? అసలు ఆ గ్రహశకలాన్ని అడ్డుకునే టెక్నాలజీ నాసాకు కానీ, మరేదైనా అంతరిక్ష పరిశోధనా సంస్థకు ఉందా ? అనే ప్రశ్నలు ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్నాయి.

దశాబ్దాల కాలంగా  గ్రహశకలాల (Asteroids) వల్ల భూమికి పొంచి ఉన్న ప్రమాదాలను ఖగోళ శాస్త్రవేత్తలు ట్రాక్ చేస్తూనే ఉన్నారు. 6.5 కోట్ల సంవత్సరాల కిందట గ్రహశకలాలు భూమిని ఢీకొట్టడం వల్ల 70శాతం జీవరాశులు అంతరించిపోయినట్టు తెలుస్తోంది.

గ్రహశకలాలు ఢీకొనడం వల్ల సునామీలు, అగ్నిపర్వతాలు, భూకంపాలు, కార్చిచ్చులు వ్యాపిస్తాయని శాస్త్రవేత్తల అభిప్రాయం. కైనెటిక్ ఇంపాక్టర్ టెక్నాలజీ గ్రహశకలాల వేగం, మార్గాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది. భూమికి ఇలాంటి విపరీత విపత్తుల నుంచి కాపాడుకోవడానికి ఈ మిషన్ ద్వారా అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు.

- Advertisement -

ప్రస్తుతం భూమివైపునకు దూసుకొస్తున్న గ్రహశకలం (Asteroid may hit the earth) 330 మీటర్ల పొడవు ఉంటుందని అంచనా వేస్తున్నారు స్పేస్ సైంటిస్టులు.  ఇది డిసెంబర్ 11న భూమికి దగ్గరగా రానుంది. ఇది సెకండ్‌కి 6.58 కిలోమీటర్ల వేగంతో వస్తోందని, అంటే ఈ గ్రహశకలం హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి 90 సెకండ్ల కంటే తక్కువ సమయంలోనే వెళ్లగలదని అర్థం.

ఇంతటి వేగంతో దూసుకొస్తున్న గ్రహశకలం భూమిని ఢీ కొడుతుందా లేదా ఎప్పటిలానే పక్కనుంచి వెళ్లిపోతుందా అనేది తెలియడం లేదంటున్నారు శాస్త్రవేత్తలు. ఒకవేళ భూమిని ఢీ కొడితే మాత్రం ముప్పు ఎక్కువే ఉండవచ్చనేది ఓ అంచనా.

నాసా (NASA) త్వరలో ప్రయోగించనున్న వ్యోమనౌక ద్వారా కాస్మిక్ ముప్పు నుంచి భూమిని రక్షించవచ్చని తెలుస్తోంది. ఇందులో భాగంగా వ్యోమనౌకతో గ్రహశకలాన్ని ఢీ కొట్టి పరీక్షించనుంది. ఈ మిషన్ విజయవంతమైతే.. భవిష్యత్‌లో ఎదురయ్యే ముప్పును సునాయసంగా ఇటువంటి సాంకేతికతతో జయించవచ్చు అంటున్నారు సైంటిస్టులు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement