అతనో సాదా సీదా వ్యక్తిలాగే కనిపిస్తాడు.. తన తండ్రి ద్వారా నేర్చుకున్న కళకు మరింత పదునుపెట్టి సుగంధ ద్రవ్యాల తయారీ, ఎడిబుల్ ఎస్సెన్స్, పర్‌ఫ్యూమ్స్ తయారు చేయడం నేర్చుకున్నాడు. వ్యాపారం బాగా సాగుతున్నా తన సొంతూరు నుంచి సిటీకి రావడానికి మాత్రం ఇప్పటికీ పాత డొక్కు స్కూటర్‌నే వినియోగిస్తాడు. ఎట్లాంటి హంగు, ఆర్బాటాలకు వెళ్లడు. అయితే ఈ మధ్య ఐటీ అధికారులు తన ఇల్లు, వ్యాపార సంస్థలపై దాడి చేయగా కళ్లు బైర్లు కమ్మే నిజాలు బయటపడ్డాయి. రెండు అతిపెద్ద బీరువాల నిండా నోట్ల కట్టలు, మరో రూమ్‌లో అస్సలు లెక్కల్లోకే రాని బంగారం, వెండి, ఎర్రచందనం వంటివి బయటపడ్డాయి. ఇవన్నీ ఉత్తర ప్రదేశ్‌లోని బిజినెస్ మన్ పీయూష్ జైన్‌కు సంబంధించిన వాస్తవాలు..
జైన్ కన్నౌజ్‌లో ఓ పాత స్కూటర్‌పై వెళ్తున్నాడు. అతని ఇంటి బయట రెండు కార్లు ఒక క్వాలిస్, మారుతీ పార్క్ చేసి ఉన్నాయి.. అంతా అతన్ని చూసి సాదాసీదా వ్యక్తి అనుకుంటుంటారు.. కానీ, కాన్పూర్‌కు చెందిన సుగంధ ద్రవ్యాల తయారీ సంస్థ 250 కోట్లకు పైగా డబ్బులు పోగుచేసినట్టు గత వారం కేంద్ర ఏజెన్సీలు గుర్తించాయి. వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) ఎగవేతకు సంబంధించిన కేసులో బిజినెస్ మన్ పీయూష్ జైన్‌ను అరెస్టు చేశారు.
కన్నౌజ్‌లోని అతని ఇల్లు, ఫ్యాక్టరీలో 250 కోట్లకు పైగా నగదు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కరెన్సీ నోట్ల కుప్పలను లెక్కించేందుకు అధికారులు క్యాష్ కౌంటింగ్ మెషీన్లను తెప్పించారు. కరెన్సీ కట్టలు గుట్టలు, గుట్టలుగా రూమ్‌లో పోసి క్యాష్ కౌంటింగ్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయ్యాయి. కాగా, నకిలీ ఇన్‌వాయిస్‌లను సృష్టించి, ఇ-వే బిల్లులు లేకుండా వస్తువులను ట్రాన్స్ పోర్ట్ చేస్తున్నట్టు అధికారుల పరిశీలనలో తేలింది.
పియూష్ జైన్ రసాయన శాస్త్రవేత్త అయిన అతని తండ్రి నుండి సుగంధ ద్రవ్యాలు, ఎడిబుల్ ఎస్సెన్స్ తయారు చేసే కళను నేర్చుకున్నాడు. జైన్ కాన్పూర్‌లో పెర్ఫ్యూమ్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. 15 సంవత్సరాల్లో దీన్ని దేశంలోని అనేక ప్రాంతాలకు విస్తరించాడు. అతనికి ఇప్పుడు ముంబై, గుజరాత్‌లో వ్యాపారం జోరుగా సాగుతోంది. వ్యాపారం అభివృద్ధి చెందడంతో జైన్ అతని బ్రదర్ అంబరీష్ వారి కన్నౌజ్ ఇంటిని 700 చదరపు గజాల భవనంగా మార్చేశారు.
అయితే.. పీయూష్ జైన్ సిటీకి వచ్చినప్పుడల్లా తన పాత డొక్కు స్కూటర్‌పై మాత్రమే కనిపించేవాడని, సాదాసీదా జీవనం సాగిస్తాడని స్థానికులు చెబుతున్నారు. నగదుతో పాటు జైన్ నివాసం, ఫ్యాక్టరీలో కోట్ల విలువైన బంగారం, వెండి, లెక్కలోకి రాని చందనం, సుగంధ ద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతని అరెస్టు తర్వాత, విచారణ కోసం అహ్మదాబాద్‌కు తీసుకెళ్లాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.