(హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి) – ఈ మధ్య వరుస ప్రశ్నాపత్రాల లీకేజీలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. లీకేజీ లకు సంబంధించి దర్యాప్తు చేస్తున్న సీఐడీ ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌లోని క్రింది స్థాయి సిబ్బంది, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ని కొందరు ఉపాధ్యాయులపై కేసులు నమో దు చేసి అసలు నేరస్తులపై దృష్టి మళ్ళించక పోవడం ప్రభుత్వానికి మరిన్ని ఇబ్బందులు కొని తెస్తోంది. ఇప్పటికే విపక్షాలన్నీ పేపర్ల లీకేజీలపై ప్రభుత్వాన్ని ఆడిపోసుకున్నాయి. ఇందుకు కారకుల్ని గుర్తించి కేసులు నమోదు చేయాల్సిన బాధ్యత సీఐడీ, ప్రత్యేక బృందాల అధికారులపై ఉంది. కానీ పేపర్ లీకేజీ వ్యవహారంలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు గుర్తించిన ఈ అధికారులు ఆ స్థాయిలో నగదు మారకానికి అవకాశాలు గల వ్యవస్థలపై అవగాహన కలిగుండి కూడా ఆ దిశగా దర్యాప్తు చేయడంలేదు.
ఈ కార్పోరేట్లు ఇతర వ్యవస్థల్ని తమ గుప్పెట పట్టాయి. అధికారుల్ని సైతం లోబర్చుకున్నాయి. అవసరాన్ని బట్టి లక్షలు, కోట్లు సునాయాశంగా వెదజల్లుతున్నాయి. భారీ ప్రచారార్భాటాలతో విద్యార్థుల్ని ఆకర్షిస్తున్నాయి. పరీక్షల సమయంలో కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నాయి. విద్యార్థుల నుంచి లక్షలాది రూపాయల్ని ఫీజులుగా వసూలుచేస్తున్నాయి. తమ వద్ద కోచింగ్ పొందితే ఉద్యోగం గ్యారంటీ అంటూ భరోసా కల్పిస్తున్నాయి. ఇందుకోసం విద్యార్థుల నుంచి అదనపు రుసుములను వసూలు చేస్తున్నాయి. ఇలాంటి కార్పొరేట్ విద్యాసంస్థలే ఇప్పుడు పేపర్ లీకేజీకి తెరదీస్తున్నాయి. చిన్న చిన్న ప్రభుత్వోద్యోగుల్ని మచ్చిక చేసుకుని, ప్రలోభాలకు గురిచేసి పేపర్లను ముందుగా తస్కరిస్తున్నాయి. తమ విద్యార్థులకు మాత్రమే వీటిని అందిస్తున్నాయి. తద్వారా ఈ సంస్థలు కోట్లలో ఆదాయాన్ని పొందుతున్నాయి.
అయితే వీటి నిర్వాహకం ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తోంది. నిజాయితీగా, నిబద్ధతతో చదివి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు వెనుకబడిపోతున్నారు. లీకేజీలతో అనర్హులు సునాయాసంగా పరీక్షల్లో విజయం సాధిస్తున్నారు. మంచి మంచి ఉద్యోగాలు పొందుతున్నారు. సహజంగానే ఇది విద్యార్థి లోకంలో ఆగ్రహానికి దారితీస్తోంది. ప్రజాసంఘాలకు కూడా చిర్రెత్తిస్తోంది. వీరంతా ప్రభుత్వాన్ని ఆడిపోసుకుంటున్నారు. ఈ ప్రక్రియలో ప్రభుత్వం జవాబుదారీగా మారుతోంది. ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలకు అడ్డుకట్టేయాల్సిన బాధ్యత సీఐడీ, ప్రత్యేక దర్యాప్తు బృందాల అధికారులదే. కానీ వారెవరూ ఈ దిశగా చర్యలు చేపట్టడం లేదు. పైగా పరీక్షలకు హాజరౌతున్న విద్యార్థులపై కేసులు నమోదు చేస్తున్నారు. వాస్తవానికి ఏ విద్యార్థి కూడా పేపర్ల కోసం లక్షలు, కోట్లు చెల్లించగలిగే ఆర్థిక సామర్థ్యం కలిగుండడు. అలాగే ఏ ఒక్క విద్యార్థి ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌లో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే పరీక్ష పేపర్లను లీక్ చేయించే సామర్థ్యం కాదు. చిన్న చిన్న ఉద్యోగులు తమం త తాము పేపర్లు తస్కరించి మార్కెట్లో అమ్ముకునే వీలుండదు.
కానీ ఇప్పుడు సీఐడీ అధికారులు వీరిపైనే ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో నిజమైన ఆర్థిక లబ్ధిదార్లు, కార్పొరేట్ విద్యావ్యవస్థలన్నీ తప్పించుకుంటున్నాయి. వాస్తవానికి ఈ కేసును సీఐడీ అధికారులు తప్పుదారి పట్టిస్తున్నారు. ప్రభుత్వ ప్రతిష్ట దిగజారడానికి కారణమౌతున్నారు. దీర్ఘకాలంగా తెలుగురాష్ట్రాల్లో విద్యారంగం భ్రష్టుపట్టింది. లీకేజీలే కాదు.. మాల్‌ప్రాక్టీస్ కూడా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్ విద్యాసంస్థలు వేళ్ళూనుకున్నప్పటి నుంచి ఈ దురావస్థ విస్తృతమైంది. ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు తమ విద్యార్థులకు మార్కులు, ర్యాంకుల కోసం ఎంతకైనా దిగజారుతున్నాయి. మొదట్లో టెన్త్, ఇంటర్ పరీక్షల్లో లీకేజీలకివి పాల్పడ్డాయి. కాగా ఇటీవల కాలంలో ఉద్యోగాల కోసం జరిగే పోటీ పరీక్షలకు శిక్షణా కేంద్రాల్ని కూడా ఇవి భారీగా నిర్వహిస్తున్నాయి. కేవలం 45రోజుల శిక్షణ కోసం వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి.
ఇక ముందస్తుగా పేపర్లు అందించేందుకు విద్యార్థుల నుంచి లక్షల్లోనే రాబడుతున్నాయి. వీరికి ప్రభుత్వంలోని కొందరు ఉద్యోగుల సహకారం కూడా తోడౌతోంది. వరుసగా పేపర్లు లీకౌతున్నాయి. ఈ కార్పొరేట్ విద్యావ్యవస్థల్లోని లోపాల్ని చట్టవ్యతిరేక చర్యల్ని కూకటివేళ్ళతో పెకలించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ బాధ్యతను సీఐడీ, దర్యాప్తు బృందాల అధికారులు చేపట్టాలి. అప్పుడే పేపర్ లీకేజీలకు సంబంధించి నిజమైన నేరస్తులు బహిర్గతమౌతారు. చట్టబద్దంగా వారికి శిక్షలు వేయించాలి. తద్వారా లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న ఆరోపణలన్నింటికి తగిన బదులిచ్చినట్లవుతుంది. ప్రభుత్వ ప్రతిష్ట తిరిగి ఇనుమడిస్తుందని సామాజిక నిపుణులు సూచిస్తున్నారు.