బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేశారు. మంత్రుల తిరుగుబాటుతో ఆయన రాజీనామా చేసేదిశగా నిర్ణయం తీసుకున్నారు. కాగా ఇప్పటికే 54మంది మంత్రులు రాజీనామా చేశారు.బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇటీవల అనేక వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. కరోనా సమయంలో అధికార నివాసంలో పార్టీ చేసుకున్నందుకు ఆయనపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. పార్టీలో కూడా బోరిస్ జాన్సన్ కు మద్దతు నానాటికీ తగ్గిపోతూ వస్తోంది. ఇటీవలి బలపరీక్షలో జాన్సన్ బొటాబొటిగా బయటపడ్డారు. ఆ తర్వాత ప్రభుత్వ డిప్యూటీ చీఫ్ విప్ క్రిస్ పించర్ వివాదం కూడా బోరిస్ మెడకు చుట్టుకుంది. 2019లో ప్రధాని జాన్సన్… క్రిస్ పించర్‌ను ప్రభుత్వ డిప్యూటీ చీఫ్ విప్‌గా నియమించారు.
అప్పటికే అతని నడవడికకు సంబంధించి పలు ఆరోపణలున్నాయి. ఆ విషయాన్ని ప్రభుత్వాధికారులు చెప్పినా జాన్సన్ పట్టించుకోకుండా క్రిస్ పించర్‌ను కీలకమైన పదవిలో కూర్చోబెట్టారు. ఇటీవల ఒక క్లబ్‌లో తాగిన మత్తులో క్రిస్ పించర్ ఇద్దరు పురుషుల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం తీవ్ర వివాదానికి దారి తీసింది. అయితే అతను ఇలాంటి వాడని తనకు తెలియదని ప్రధాని బోరిస్ తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ, పించర్ గురించి తాము ముందే నివేదించామని మాజీ అధికారి ఒకరు చెప్పడంతో బోరిస్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. దీంతో బోరిస్‌పై తమకు విశ్వాసం లేదంటూ రిషి సునాక్, జావిద్ నిన్న మంత్రి పదవుల నుంచి తప్పుకొన్నారు. ప్రధాని కూడా వైదొలగాలని డిమాండ్ చేశారు. తాజాగా మరో ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడంతో బోరిస్ జాన్సన్ ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది. దాంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.