ఈ సంక్రాంతికి సినిమాల పోటీ మామూలుగా లేదు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ లీడ్ రోల్‌లో రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమా జనవరి 7న రిలీజ్ కానుంది. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ కూడా ఈ పండుగకే వస్తుంది. వీటితో పాటు నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తున్న బంగార్రాజు సంక్రాంతి బరిలో నిలిచింది. ఇన్ని పెద్ద సినిమాలు ఉండటంతో థియేటర్లను సర్దుబాటు చేయలేక ఆయా సినిమాల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పడుతున్నారు.
ఇది గమనించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గారు. జనవరి 12న విడుదల చేస్తామని చెప్పిన భీమ్లా నాయక్ సినిమాను ఫిబ్రవరి 25కి వాయిదా వేశాడు. ఇదే విషయాన్ని ఇప్పుడు చిత్రబృందం ప్రకటించింది. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ, భీమ్లా నాయక్ వాయిదా ఎఫెక్ట్ వెంకటేశ్, వరుణ్ తేజ్ కాంబోలో వస్తున్న ఎఫ్ 3 పై పడింది. దీంతో ఈ మూవీని కూడా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయంటున్నారు మేకర్.
నిజానికి భీమ్లానాయక్ సినిమాను సంక్రాంతికి తీసుకొస్తామని.. చాలా రోజుల కిందటే ప్రకటించారు. అప్పటికే మహేశ్‌బాబు కూడా తన సర్కారు వారి పాట సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు స్లాట్ బుక్ చేసుకున్నాడు. కానీ అనుకోకుండా రాధేశ్యామ్, ట్రిపుల్ ఆర్ సినిమాలు సీన్‌లోకి రావడంతో కూల్‌గా సైడ్ అయ్యాడు మహేశ్ బాబు. తన సినిమాను సమ్మర్‌లో రిలీజ్ చేస్తానని ప్రకటించాడు. ఈ క్రమంలోనే భీమ్లా నాయక్ సినిమాను కూడా వాయిదా వేసుకోవాలని ట్రిపుల్ ఆర్ సినిమా నిర్మాతలు పవన్ కళ్యాణ్‌ను కోరారు.
అన్ని పెద్ద సినిమాలు ఒకేసారి వస్తే థియేటర్లు సర్దుబాటు చేయడంలో వచ్చే ఇబ్బందులతో పాటు ఇతర సమస్యలను పవన్ కళ్యాణ్, చిత్రబృందానికి దిల్ రాజు వివరించి వాయిదాకు ఒప్పించారు. దీంతో తమ భీమ్లా నాయక్ సినిమాను మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 25న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ అప్పటికే తమ సినిమాను ఫిబ్రవరిలో తీసుకోద్దామని ప్లాన్ చేసుకుంటున్న ఎఫ్ 3 చిత్ర బృందానికి ఇది షాకింగ్‌గా మారింది.