ప్రభన్యూస్, ప్రతినిధి/యాదాద్రిగ్యాంగ్ స్టర్ నయీం ఎన్కౌంటర్ జరిగి ఏళ్లు గడుస్తున్నా ఇంకా డైరీ ని బయట పెట్టకుండా ప్రభుత్వం ఎందుకు గోప్యంగా ఉంచుతున్నదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు.49వ రోజు పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా గురువారం భువనగిరిలో మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత ఆయన ఇంట్లో వేల కోట్ల రూపాయల నోట్లు, భూములు, బంగారం, ఆభరణాలు, వజ్రాలు దొరికినట్లు మీడియాలో ఐదారునెలపాటు కథనాలు వచ్చినప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు వాటిని ఎందుకు బయట పెట్టడం లేదని నిలదీశారు. నయీం అక్రమంగా సంపాదించిన భూములన్ని ఇప్పుడు ఎవరి పాలు అయినాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
నయన్ ఆస్తుల విషయాన్ని గోప్యంగా దాచిపెడుతూ దాటవేసి ధోరణి అవలంబిస్తున్న ఈ ప్రభుత్వానికి, నయీంకు పెద్ద తేడా ఏమున్నదన్నారు. నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత రికవరీ చేసిన ఆస్తులు అన్నిటిని ప్రభుత్వ ఖజానాలో జమ చేయకుండా కేసీఆర్ ఇంట్లో జమ అయ్యాయని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం డిజైన్ చేసిన ప్రాణహిత ప్రాజెక్టును మార్చి కాళేశ్వరం గా డిజైన్ చేసి అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలు కట్టి ఇప్పటి వరకు కేవలం 110 టీఎంసీలు మాత్రమే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోశారని తెలిపారు. కానీ శ్రీపాద ఎల్లంపల్లి నుంచి దిగువకు 1500 టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రం పాలయ్యాయని వివరించారు. రూ. 1.25 లక్షల కోట్లు ఖర్చు చేసి కట్టిన కాలేశ్వరం ద్వారా ఒక ఎకరాన్ని కూడా ఆధనంగా నీళ్లు ఇవ్వలేదన్నారు.
ఆదిలాబాద్ నుంచి భువనగిరి వరకు పాదయాత్ర చేసిన గ్రామాల్లో ప్రజలు సరైన ఇండ్లు లేక, కొలువులు రాక, ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వల్ల భూములపై హక్కులు కోల్పోయి సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతుండగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రగతి భవన్, సెక్రటేరియట్ కట్టి తెలంగాణ వెలిగిపోతుందని అనడం విడ్డూరమన్నారు. తెలంగాణ రాష్ట్రం వెలిగిపోవట్లేదని సీఎం కేసీఆర్ మాత్రం తెలంగాణ సంపదను దోపిడీ చేసి దేశంలో పార్లమెంటు విపక్ష అభ్యర్థుల ఎన్నికలకు అయ్యే ఖర్చు భరిస్తానని చెప్పేంత వెలిగిపోతున్నాడని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 12 లక్షలు ఉన్న నిరుద్యోగ సమస్య 30 లక్షలకు పెరిగిందని, రాష్ట్రంలో ఇంత పెద్దగా నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంటే తెలంగాణ ఎట్లా వెలిగినట్టు అవుతుందని ప్రభుత్వాన్ని నిలదీశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల లక్ష్యాలు నెరవేరలేదు కానీ రాష్ట్ర ప్రజలకు ఐదు లక్షల కోట్ల అప్పు, నిరుద్యోగ సమస్య ,ఉద్యోగ అవకాశాలు లేనటువంటి సమాజం, అనేక చట్టాల ద్వారా భూములపైపొందిన హక్కులు ధరిణి ద్వారా కోల్పోవడం టిఆర్ఎస్ పరిపాలనలో జరిగిందన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తిరిగి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేస్తామని, ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ కాంతాలపల్లి, పాలమూరు -రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. గీత, నేత,యాదవ బలహీనవర్గాలకు ఆర్థికంగా చేయూతను అందించేందుకు బీసీ సబ్ ప్లాన్ చట్టం తీసుకువచ్చి జనాభా తమాషా ప్రకారంగా నిధులను కేటాయిస్తామని ప్రకటించారు.