వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వివాదంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ఫస్ట్ టైమ్ స్పందించారు. ప్రతి మసీదులోను శివలింగం కోసం వెతకాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. నాగపుర్‌లో జరిగిన ఆర్ఎస్ఎస్ ఆఫీసర్ ట్రైనింగ్ క్యాంప్ ముగింపు సదస్సులో ఆయన ఈ కామెంట్స్ చేశారు.
జ్ఞానవాపి అంశం ప్రస్తుతం నడుస్తోంది. చరిత్రను మనం మార్చలేం. ఇవాల్టి హిందువులు కానీ, ముస్లింలు కానీ దాన్ని సృష్టించ లేదు. ఆ సమయంలో జరిగిన విషయం అది. దేశంపై దండెత్తివచ్చిన వారి నుంచి, బయట నుంచి ఇస్లాం వచ్చింది. ప్రజల్లో ఉన్న స్వాతంత్ర్య కాంక్షను దెబ్బతీసేందుకు జరిపిన దాడుల్లో దేవస్థానాలను కూల్చేశారు. ఇక జ్ఞానవాపి వివాదంలో విశ్వాసాలకు సంబంధించిన కొన్ని అంశాలున్నాయి. దానిపై కోర్టు నిర్ణయం తీసుకుంటుంది.. దానికి అందరూ కట్టుబడి ఉండాలి. అయితే.. ప్రతి మసీదులోనూ శివలింగం కోసం ఎందుకు అన్వేషించాలి? మరో ఉద్యమం చేపట్టేందుకు ఆర్ఎస్ఎస్ సుముఖంగా లేదు. మేము రామ జన్మభూమి ఆందోళనలో పాలుపంచుకున్నాం. అందుకు పరిస్థితులే కారణం. ప్రజాభీష్టాన్ని మేము నెరవేర్చాం. ఇంకెలాంటి ఆందోళనలకు పిలుపునివ్వాలని మేము కోరుకోవడం లేదు. అని మోహన్ భగవత్ అన్నారు.
ముస్లింలకు హిందువులు ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ఇవాల్టి ముస్లింల పూర్వీకులు కూడా హిందువులేనని పేర్కొన్నారు. మసీదుల్లో జరుగుతున్నది కూడా ఒక తరహా ప్రార్ధనేనని, అయితే అది బయట నుంచి వచ్చిందని అన్నారు. ఆరాధనా విధానాలను తాము వ్యతిరేకించడం లేదని చెప్పుకొచ్చారు.
బండికి భగవత్ కౌంటర్..
అయితే.. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన స్టేట్‌మెంట్‌కు కౌంటర్‌గా మారాయి. జ్ఞానవాపి వివాదంపై బండి సంజయ్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఉన్న ప్రతి మసీదును తవ్వించాలని, అందులో శివలింగాలు ఉంటే తాము తీసుకుంటామని, శవాలు ఉంటే ముస్లింలు తీసుకోవాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన కామెంట్స్‌ను జతచేసి సోషల్ మీడియాలో బండి సంజయ్ ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు నెటిజన్లు.. ప్రజల్లో ఉద్వేగాలు రెచ్చగొట్టి ఆ ముసుగులో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలను ప్రజల్లో చర్చకు రాకుండా అడ్డుకుంటున్నారని, పెట్రోలు ధరలు, నిత్యావసర వస్తుల ధరలు ఆకాశాన్నంటుతుంటే సామాన్యుల గురించి బీజేపీ లీడర్లు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.