ఖమ్మం, ప్రభన్యూస్ : కంటి వెలుగు ఒక అద్భుత కార్యక్రమం అని.. ఈ పథకం ప్రారంభానికి తెలంగాణకు వచ్చి ఎంతో నేర్చుకున్నానని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ అన్నారు. బుధవారం ఖమ్మంలో జరిగిన బీఆర్‌ఎస్ సభలో ఆయన మాట్లాడారు. పంజాబ్‌లోనూ ఈ పథకాన్ని ప్రవేశపెడతామని ప్రకటించారు. అయితే ఖమ్మం బీఆర్‌ఎస్ సభకు వచ్చిన ప్రజలను చూడడానికి కూడా సీఎం కేసీఆర్ ఒక ప్రత్యేక కళ్లాద్దాలనిస్తే బాగుంటుందని చమత్కరించారు. తెలంగాణ దేశంలో మెరుస్తోందన్నారు. భారత దేశం యువత ఎక్కువగా ఉన్న దేశమని, యువత ఉద్యోగాలు కావాలంటోందన్నారు. బీజేపీ అన్ని వాగ్ధానాలను తుంగలో తొక్కి భారతీయ జువ్లూ పార్టీగా అవతరించిందన్నారు.
త్వరలోనే కేంద్రంలో కొత్త సర్కారు కొలువుదీరుతుందని జోస్యం చెప్పారు. అసలైన ప్రభుత్వం వస్తే దేశం నెంబర్‌వన్‌గా మారుతుందన్నారు. ఎక్కడైనా ఎలక్షన్‌లో గెలవకపోతే బై ఎలక్షన్ ద్వారా గెలవాలని, ఎమ్మెల్యేలను కొని అధికారం చేజిక్కించుకోలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఎద్దేవా చేశారు. ఇటీవల ఢిల్లి మునిసిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ కంటే ఎక్కువ సీట్లు తాము గెల్చుకుంటే మేయర్ మాత్రం మాదే అని బీజేపీ అంటోందని గుర్తు చేశారు. ఇది ఎలా సాధ్యం, ఇదేం రాజకీయమని సింగ్ ప్రశ్నించారు. బీజేపీది ప్రజాస్వామ్యం కాదని, లూట్ స్వామ్యం అని మండిపడ్డారు.
ప్రధాన మంత్రి ఎర్రకోటపై నుంచి ప్రతిసారి చెప్పేదాంట్లో ఏది జరగడం లేదని, కనీసం ఆయన తన ప్రసంగాన్నైనా మార్చుకోవాలని సూచించారు. ప్రజలు తమ గుండెల్లో ఉన్నవారికే అధికారమిస్తారన్నారు. పంజాబ్ ఎన్నికల్లో ఇదే జరిగి ఆప్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. బీజేపీ దోస్తుల కోసం ఆలోచిస్తోంది తప్ప ప్రజల కోసం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఫర్ ఛేంజ్ అని పిలుపునిస్తోందని, అది ఛేంజ్ కాదని ఎమ్మెల్యేల ఎక్స్ఛేంజ్ అని ఎద్దేవా చేశారు. భగత్ సింగ్, రాజ్‌గురూలను గుర్తు చేస్తూ ఇంక్విలాబ్ జిందాబాద్.. జిందాహైతో ఫిర్ మిలేంగే వంటి నినాదాలు చేస్తూ మాన్ తన ప్రసంగాన్ని ముగించారు.