ఓ దొంగని మార్చింది భగవద్గీత. దాంతో తాను దొంగతనం చేసిన నగలని ఆలయం వద్ద విడిచిపెట్టాడు ఆ దొంగ.వివరాల్లోకి వెళ్తే.. ఒడిషాలోని గోపీనాథ్‌పూర్‌లోని గోపీనాథ్ ఆలయంలోని శ్రీకృష్ణుడి ఆభరణాలను దొంగిలించిన ఓ దొంగ తొమ్మిదేళ్ల తర్వాత వాటిని తిరిగి ఇచ్చేశాడు. ఇటీవల భగవద్గీత చదివి.. తాను వెళ్తున్న మార్గం తప్పని అర్ధం చేసుకున్న అతను.. లక్షల విలువ చేసే కృష్ణుడి ఆభరణాలను తిరిగిచ్చేశాడు. అంతేకాదు.. ఆలయ కమిటీకి ఓ లేఖను కూడా పంపాడు. 2014లో యజ్ఞశాలలో.. తొమ్మిదేళ్ల క్రితం శ్రీకృష్ణుడు ఆభరణాలను దొంగిలించానని, కానీ ఈ సమయంలో తాను ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాని .. అయితే ఇప్పుడు వాటిని తిరిగి ఇచ్చేస్తున్నట్లు చెప్పాడు.
శ్రీకృష్ణుడి తలపాగా, చెవిపోగులు, కంకణాలు, వేణువు ఇతర ఆభరణాలు వున్న బ్యాగ్‌ను పేరు తెలియని దొంగ ఆలయ ముఖద్వారం వదిలిపెట్టి వెళ్లిపోయినట్లు పూజారి శ్రీదేబేష్ చంద్ర మొహంతి తెలిపాడు. తాను చేసిన పనికి క్షమాపణాలు చెబుతూ.. ఆభరణలతో పాటు మరో రూ.300 కూడా ఆ బ్యాగ్‌లో వుంచినట్లు పూజారి పేర్కొన్నాడు. శ్రీకృష్ణుడు బోధనలకు ఆ దొంగ చలించిపోయి.. దొంగిలించిన ఆభరణాలను తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఆ లేఖలో పేర్కొనాడని పూజారి చెప్పారు. ఇది ఇలా ఉండగా ఎప్పుడో తొమ్మిదేళ్ల క్రితం చోరీకి గురైన నగలు తిరిగి రావడంతో ఆలయ అధికారులు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దొంగ పశ్చాత్తాపం చెందడం, శ్రీకృష్ణుని బోధనల ప్రాముఖ్యతను గుర్తించడం భగవద్గీత శక్తికి నిదర్శనమని తెలిపారు.