పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో పరారీలో ఉన్న నిందితుడు వనమా రాఘవేంద్రరావు కోసం జిల్లా పోలీసు బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. రాఘవేంద్రరావును గుర్తించి పట్టుకుని అరెస్ట్ చేసేందుకు ఇతర జిల్లాల పోలీసుల సహకారం కూడా తీసుకుంటున్నామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ తెలిపారు. వీలైనంత త్వరలోనే వనమా రాఘవని అదుపులోకి తీసుకోవడానికి అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.
కాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో రాఘవ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పెండింగ్లో ఉన్న ఆస్తికి సంబంధించిన సమస్యను పరిష్కరించేందుకు రాఘవేంద్రరావు తన భార్యను లైంగికంగా కోరుతున్నాడని ఆరోపిస్తూ బాధితుడు రామకృష్ణ సెల్ఫీ వీడియో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. తమ ఆత్మహత్యకు రాఘవే కారణమంటూ బాధితుడు రామకృష్ణ ఆరోపించాడు. సెల్ఫీ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత రాఘవేంద్ర అదృశ్యమయ్యారు. నిన్న వనమా రాఘవను అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే, అందులో నిజం లేదని, అతని ఆచూకీ ఇంకా లభించలేదని పోలీసులు స్పష్టం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..