హైదరాబాద్, ఆంధ్రప్రభ: కొన్ని నెలల క్రితం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన లోన్ యాప్ మోసాలు మళ్లీ క్రమక్రమంగా పెరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. లోన్‌యాప్‌ల మాయలో పడొద్దని ప్రజలకు సూచిస్తున్నారు. లోన్‌యాప్ మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చాలా యాప్‌లు ఫోన్ ద్వారా రుణాలను అందిస్తాయి, అవసరమైన వ్యక్తులు వారి పరిచయాలను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తారు. సులభమైన వాయిదాలు, వడ్డీలని నమ్మించినప్పటికీ అధిక వడ్డీ రేటును వసూలు చేస్తారు, ఎవరైనా తిరిగి చెల్లించడంలో విఫలమైనా, ఆలస్యం చేసినా సదరు కంపనీ ప్రతినిధులు రుణదాతకు సంబంధించిన కాంటాక్ట్‌లందరినీ సంప్రదించడం, మెసేజ్ చేయడం ద్వారా వేధించడం ప్రారంభిస్తారని హెచ్చరించారు.
ఈ క్రమంలోనే లోన్‌యాప్స్ నుంచి రుణాలు తీసుకున్న వారిని వేధింపులకు గురిచేయడంతో పాటు భయపెడుతూ అధికంగా వడ్డీ వసూలు చేస్తున్నారని హెచ్చరించారు. ఇలాంటి వాటిపట్ల జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు కోరారు. గూగుల్‌ప్లే స్టోర్‌లో పెద్ద మొత్తంలో నకిలీ లోన్ యాప్స్ ఉన్నాయని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. గూగుల్‌ప్లేలో 100కి పైగా నకిలీ రుణాల యాప్‌లున్నాయని తెలిపారు. తెలంగాణ పోలీసులు ఇటీవలి నెలల్లో లోన్ యాప్ వ్యాపారాన్ని అక్రమంగా నడుపుతున్న పలు కంపెనీలపై చర్యలు తీసుకున్నారు. నకిలీ వ్యాపారాన్ని నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. పలు బ్యాంకులలోని ఖాతాలను సీజ్ చేసి దాదాపు రూ.500 కోట్ల వరకు ఫ్రీజ్ చేశారు. లోన్‌యాప్స్ మోసాలతో వ్యాపారం నిర్వహించడంలో కీలకంగా ఉన్న చాలా మంది వ్యక్తులను అరెస్టు చేశారు. కంపెనీల ఎగ్జిక్యూటివ్‌ల బారినపడి తెలంగాణలో కొంతమంది వ్యక్తులు బలవంతంగా ప్రాణాలు తీసుకున్న ఘటనలు కూడా చాలానే ఉన్నాయి.
లోన్ యాప్స్ నిర్వాహకులపై కేసులు నమోదు చేయడం.. అరెస్టు చేయడం.. వారికి శిక్షలు పడటం జరుగుతుండగానే మరో కొత్త పేరుతో లోన్ యాప్‌లు పుట్టుకు రావడం.. మళ్లి ఇదే దందా కొనసాగడం ఆందోళన కలిగించే విషయమని పోలీసులు అంటున్నారు. ఇటీవల బాధితుల నుండి ఫిర్యాదుల మేరకు పోలీసులు మరికొన్ని కేసులు నమోదు చేశారు. గత నెల రోజుల వ్యవధిలో ఆన్‌లైన్ లోన్‌యాప్‌లపై 50 కేసులు నమోదయ్యాయని సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ చెప్పారు. 2020 – 21 లో ఆన్‌లైన్ లోన్‌యాప్‌పై 28 కేసులు నమోదయ్యాయి.
ఈ కేసుల్లో 24 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కొంత కాలంగా స్ధబ్దుగా ఉన్న ఆన్‌లైన్ లోన్‌యాప్ సంస్థలు తిరిగి తమ కార్యక్రమాలను ప్రారంభించినట్టుగా పోలీసులు గుర్తించారు. బెంగుళూరు, ఢిల్లీలలో కాల్ సెంటర్లను ఏర్పాటు చేశారని పోలీసులు గుర్తించారు. ఈ సెంటర్లపై దాడులు చేసేందుకు పోలీసులు సన్నద్దమవుతున్నారు. ఆన్‌లైన్ లోన్‌యాప్‌లను చైనాకు చెందిన కంపెనీలవేనని పోలీసులు తేల్చారు. చైనా కంపనీలు కొన్ని భారతీయులను అడ్డుగా పెట్టుకుని కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్నాయని పోలీసులు గుర్తించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..