Friday, November 22, 2024

Telangana | టీపీహెచ్‌సీపి మానిటరింగ్‌ హబ్‌తో బెట‌ర్‌మెంట్‌.. పెరిగిన ఉద్యోగుల హాజరు శాతం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రారంభించిన పిహెచ్‌సి మానిటరింగ్‌ హబ్‌ సత్పలితాలనిస్తున్నది. రాష్ట్ర్రవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య కేంద్రాలలో రోగులకు అందుతున్న వైద్య సేవల పనితీరును సిసిటివిల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతో పాటు మండల వైద్యాధికారి, ఇతర సిబ్బంది విధులకు సరైన వేళలకు హాజరయ్యే ఉద్దేశ్యంతో మూడు నెలల క్రితం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు కోఠిలోని ప్రజారోగ్య శాఖ సంచాలకుల కార్యాలయంలో పిహెచ్‌సి మానిటరింగ్‌ హబ్‌ను ప్రారంభించారు. దీంతో గ్రామీణ ప్రాంతాల స్థాయిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలు కలుగుతున్నది.

దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఉన్న 887 గ్రామీణ, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఈ హబ్‌తో అనుసంధానం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను వైద్య సేవల పరంగా బలోపేతం చేయడంతో పాటు డీహెచ్‌ కార్యాలయంలో ప్రత్యేకంగా కొందరు సిబ్బందిని నియమించి ఏ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏ ఉద్యోగి ఏ సమయానికి విధులకు హాజరువుతున్నారు? రోగులు ఏ వైద్యం కోసం ఆరోగ్య కేంద్రాలకు వస్తున్నారు ? వైద్య, వైద్యేతర సిబ్బంది రోగులకు అందుబాటులో ఉంటున్నారా ? అనే విషయాలను ఈ హబ్‌ ద్వారా పర్యవేక్షిస్తున్నారు.

అలాగే, ఈ టీ హబ్‌ను కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌, ప్రజారోగ్య శాఖ సంచాలకుల కార్యాలయం, తెలంగాణ స్టేట్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను సైతం అనుసంధానం చేశారు. కాగా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సూపర్‌ స్పెషాలిటీ వైద్యం కోసం వచ్చిన రోగికి అక్కడ సదరు వైద్యం అందుబాటులో లేని పక్షంలో అక్కడి నుంచే సూపర్‌ స్పెషాలిటీ వైద్యునికి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వైద్య సలహాలు ఇచ్చే ఏర్పాటు సైతం చేశారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలోని 43 కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణ పనులు వేగంగా నడుస్తున్నాయి. ఇందుకోసం రూ.67 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అలాగే, శిథిలావస్తలో ఉన్న 372 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మరమ్మత్తు పనులు కూడా సాగుతుండగా, 1239 సబ్‌ సెంటర్లకు సంబంధించి కొత్త భవనాల నిర్మాణం కూడా తుది దశకు చేరుకుంది.

- Advertisement -

కాగా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సరైన సమయానికి విధులకు హాజరు కాని మండల వైద్యాధికారులు, ఇతర సిబ్బందికి మెమోలు జారీ చేస్తున్నట్లు వైద్య,ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. మొదటి సారి మెమోలు జారీ చేసినప్పటికీ వైద్యులు, వైద్యేతర సిబ్బంది పనితీరు మార్చుకోని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మరోవైపు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకు రావడానికి కూడా టీ పిహెచ్‌సి మానిటరింగ్‌ హబ్‌ ఉపయోపడుతున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement