Tuesday, November 26, 2024

మొన్న బీటా, నిన్న డెల్టా.. ఇప్పుడు ఒమిక్రాన్​.. అరికట్టడం ఎలా?

ప్ర‌భ‌న్యూస్: ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కొత్త ఉత్పరివర్తనం ఒమిక్రాన్ (బి.1.1.529)ను ఎలా గుర్తించారన్నది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. దీనిపై దక్షిణాఫ్రికా, బ్రిటన్ దృష్టి సారించాయి. ఆ కొత్త వేరియంట్ పుట్టుక, తొలి కేసులు వెలుగుచూసిన ప్రాంతం, అంతకుముందు ఆ దేశంలో కరోనా వైరస్ లో వచ్చిన మార్పులను విశ్లేషిస్తున్నారు. డెల్టా రకం వైరస్ కన్నా ప్రమాదకరంగాను, వేగంగాను వ్యాపిస్తున్న ఈ కొత్త వేరియంట్ ఇప్పటికే దక్షిణాఫ్రికాను చుట్టుముట్టేసింది. ప్రపంచదేశాలు, ప్రధానంగా ఐరోపా దేశాలు ద.ఆఫ్రికా దేశాలనుంచి రాకపోకలను నిషేధిస్తున్నాయి. అయితే, ఈ కొత్త ఉత్పరివర్తనం కేసుల వ్యాప్తిని ఎలా గుర్తించారన్న దానిపై వివిధ కథనాలు వెలుగుచూస్తున్నాయి. గత ఏడాది చివర్లో కరోనా వైరస్ లోని కొత్త ఉత్పరివర్తనం 50 1వై.వి2 ను గుర్తించారు.

దానికే ఇప్పుడు ఒమిక్రాన్ గా పేరుపెట్టారు. తాజా వేరియంట్ కు సంబంధించిన పరిశోధనల వివరాలపై ఆప్రికాకు చెందిన ఓజైర్ పటేల్ శాస్ర్తవేత్తలను కోరారు. కోవిడ్ -19 మహమ్మారి ఉద్భవించినప్పటి నుంచి దక్షిణాఫ్రికాలో ఆ వైరస్ లో వచ్చిన ఉత్పరివర్తనాలపై ఇంతవరకు జరిగిన పరిశోధనల ఫలితాలను మరోసారి పరిశీలించారు. నిజానికి దక్షిణాఫ్రికాలో అత్యాధునిక ప్రజారోగ్య, వైద్య వ్యవస్థలు ఉన్నాయి. అందువల్ల దేశంలో ఎక్కడ కరోనా కేసులు వెలుగు చూసినా అక్కడి డేటా ప్రధాన ప్రయోగశాలకు చేరుతుంది. అలా కొత్త కేసులకు సంబంధించి వచ్చిన డేటాను ఇప్పుడు విశ్లేషిస్తున్నారు. కరోనా వైరస్ గత ఉత్పరివర్తనాలు, వ్యాక్సినేషన్ తరువాత వాటి నియంత్రణ, యాంటీబాడీస్ ఉత్పత్తి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. తాజా వేరియంట్ ను నిర్వీర్యం చేయడానికి ఎలాంటి వైద్యం అందించాలన్నదానిపై అంచనాకు వస్తున్నారు. దక్షిణాఫ్రికాలోని అనేక దేశాల్లోను, అటు బ్రిటన్ లోను డెల్టా వేరియంట్ అల్లకల్లోలం చేసింది. ఈ పరిస్థితుల్లో ఓమిక్రాన్ పుట్టుకొచ్చింది.

ఈనెల రెండోవారంలో గ్వాటెంగ్ ప్రావిన్స్ లో సేకరించిన 77 నమూనాల్లో ఈ కొత్త వేరియంట్ వైరస్ ను గుర్తించారు. బీటా, డెల్టా వేరియంట్లకన్నా ఇది ప్రమాదకరమైనదని గుర్తించారు. ప్రమాదకరమైన ఈ కొత్త వేరియంట్లు దక్షిణాఫ్రికాలోనే ఎందుకు వస్తున్నాయన్నదానిపై విశ్లేషణలు చేస్తున్నారు. ఇక్కడి ప్రజల్లో పౌష్టికాహార లోపం, రక్తహీనత వంటివాటివల్ల రోగనిరోధక శక్తి ఉండదని, అందువల్ల వైరస్ ల ఉత్పరివర్తనాలు వేగంగా జరుగుతున్నాయని అంచనాకొచ్చారు. సాధారణ కరోనా వైరస్ సోకిన తరువాత దాని ప్రభావం తగ్గినప్పటికీ, రోగి శరీరంలో సుదీర్ఘకాలం పాటు వైరస్ ఉండటం వల్ల ఈ మ్యుటేషన్ ప్రక్రియ జరుగుతోందని, కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయన్నది ఓ విశ్లేషణ.

హెచ్ఐవీతో బాధపడుతున్న రోగులకు కరోనా వైరస్ సోకినప్పుడు వారిలో అది ఉత్పరివర్తనం చెందుతోందన్నది మరో అంచనా. మానవ శరీర భాగాల్లోని లోపలి పొరలపై అంటిపెట్టుకునేందుకు వాటికి ఉన్న ప్రొటీన్ కొమ్ములు కీలకమైనవి. తాజా వేరియంట్ లో ఈ కొమ్ముల్లోనే 30 వరకు ఉత్పరివర్తనాలు వచ్చాయి. ఈ కొమ్ముల ఆధారంగానే ఇప్పటివరకు వ్యాక్సిన్లను కనుగొన్నారు. కొత్త వేరియంట్ ను కట్టడి చేయడానికి కూడా ఈ అంశమే కీలకం కాబోతోంది. ఇది డెల్టా వేరియంట్ నుంచి వచ్చిన ఉత్పరివర్తనం కాదని తేల్చేశారు. ఇది సరికొత్త రకం. అందువల్ల దీని వ్యాప్తి, నివారణ, వ్యాక్సిన్లను ఎదుర్కొనే తీరుపై ఇప్పటికిప్పుడు సమాధానాలు లేవు. కాకపోతే, ఇప్పటికే ఈ వేరియంట్ లక్షణాలు, వ్యాప్తి తీరుని పరిశీలిస్తున్నశాస్ర్తవేత్తలు త్వరలోనే ఒక నిర్ణయానికి రావొచ్చు.

నిర్ణీత ప్రాంతంలో, నిర్ణీత సమయంలో ఎన్ని కేసులు నమోదవుతున్నాయని, వాటి ప్రభావం ఎలా ఉందన్నదానిపై కొత్త వేరియంట్ ఎంత ప్రమాదకరమైనదో తేలుస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే విశ్లేషణలు మొదలయ్యాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్నవ్యాక్సిన్లు కట్టిడి చేయగలవా అన్న దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. ప్రపంచం అంతటా వేగంగా వ్యాక్సినేషన్ ఒక్కటే పరిష్కారమార్గంగా కొందరు పరిశోధకులు చెబుతున్నారు. లేదా ప్రకృతిలో సహజసిద్ధమైన నిరోధక పరిస్థితులైనా రావాలని వారు కోరుకుంటున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement