అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్) లో తెలంగాణ అటవీశాఖ తరపున ఏర్పాటు చేసిన స్టాల్ కు ఫస్ట్ ప్రైజ్ దక్కింది. ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శనలో అటవీశాఖకు తొలి బహుమతి వచ్చింది. తెలంగాణకు హరితహారం ద్వారా అటవీశాఖ ఏడేళ్లుగా అమలు చేస్తున్న పర్యావరణ హిత కార్యక్రమాలను ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రదర్శించింది. పచ్చదనం పెంపు, జంతు సంరక్షణ చర్యల నమూనాలను ఈ ప్రదర్శనలో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
ఫారెస్ట్ థీమ్ తో ఏర్పాటు చేసిన ప్రవేశ ద్వారంతో పాటు, పిల్లల కోసం ఏర్పాటు చేసిన మినీ జూ కూడా సందర్శకులను పెద్ద సంఖ్యలో ఆకట్టుకుంది. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగిన ముగింపు కార్యక్రమంలో హోం మంత్రి మహబూబ్ అలీ, ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధుల చేతులు మీదుగా అటవీశాఖ అధికారులు బహుమతిని అందుకున్నారు. అటవీశాఖ స్టాల్ ను చక్కగా నిర్వహించి, మొదటి బహుమతి గెల్చుకున్న అధికారులు, సిబ్బందిని పీసీసీఎఫ్ & హెచ్ఓఎఫ్ఎఫ్ ఆర్.ఎం. డోబ్రియల్ అభినందించారు.