టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్నాయుడికి అరుదైన గౌరవం దక్కింది. ఉత్తమ పార్లమెంటేరియన్-2021 అవార్డును టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అందుకున్నారు. ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ అవార్డులను ప్రదానం చేశారు. 2020 సంవత్సరానికి సంబంధించి ‘ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్’ సంస్థ ఈ అవార్డులను ప్రకటించింది. పార్లమెంటు ఉభయసభల్లో ఎంపీలు తమ విధి నిర్వహణ, ప్రసంగాలలో చూపించే ప్రతిభ, సమర్ధత, వాక్చాతుర్యం, సమయస్ఫూర్తి తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఈ సంస్థ ఏటా అవార్డులను ప్రకటిస్తుంది. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. దేశానికి, ఏపీ రాష్ట్రానికి మంచిపేరు తీసుకొచ్చేలా ముందుకు వెళ్తానని ప్రకటించారు.
గతంలోనూ పార్లమెంటులో మంచి పనితీరు కనబరిచిన ఎంపీలకు ఇచ్చే ‘సంసద్ రత్న’ అవార్డు రామ్మోహన్ నాయుడును వరించిన విషయం తెలిసిందే. పిన్న వయసులో ఈ అవార్డు పొందిన పార్లమెంటు సభ్యునిగా ఆయన రికార్డు సృష్టించారు. కాగా రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం లోక్సభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దివంగత టీడీపీ నేత ఎర్రన్నాయుడు కుమారుడు. ఎర్రన్నాయుడు మృతి తర్వాత రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోకి వచ్చారు.