Tuesday, November 26, 2024

బెంగళూరులో 2 వేల కొత్త కేసులు

దేశవ్యాప్తంగా కరోనా మహ్మమారి విజృంభిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు పలు రాష్ట్రాలు విలవిల్లాడుతున్నాయి. పలు చోట్ల లాక్ డౌన్లు, నైట్ కర్ఫ్యూలను అమలు చేస్తున్నారు. కర్ణాటకపై కూడా కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. బెంగళూరులో కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. నిన్న రాత్రి విడుదలైన వివరాల ప్రకారం ఒక్క రోజులోనే బెంగళూరులో ఏకంగా 2 వేల కొత్త కేసులు నమోదయ్యాయి.

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో, వారం క్రితం బెంగళూరులోని జయానగర్ జనరల్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సదుపాయం కలిగిన 50 బెడ్లను ఏర్పాటు చేశారు. ఇప్పడు ఆ సంఖ్యను 100కు పెంచారు. ప్రస్తుతం దాదాపుగా అన్ని బెడ్లు పేషెంట్లతో నిండిపోయాయి.

కర్ణాటకలో గడిచిన 30 రోజుల్లో నమోదైన కేసులతో పోలిస్తే ప్రస్తుత కేసుల సంఖ్య 10 రెట్లు పెరిగిందని రాష్ట్ర ఆరోగ్య, వైద్య విద్య శాఖ మంత్రి సుధాకర్ తెలిపారు. మార్చి 1, 2, 3 తేదీల్లో రాష్ట్రంలో సగటున 300 కేసుల నమోదు కాగా… ఇప్పుడు ప్రతి రోజు దాదాపు 3 వేల కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. బెంగళూరులో ఎక్కువ కేసులు వస్తుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. రాష్ట్రంలో మహమ్మారి పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటోందని సుధాకర్ చెప్పారు. లాక్ డౌన్ విధించేంతగా పరిస్థితులు ఇంకా దిగజారలేదని అభిప్రాయపడ్డారు. ప్రజలందరూ కోవిడ్ నిబంధనలకు తప్పకుండా పాటించాలని మంత్రి సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement