బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని ఐటీ రాజధాని బెంగళూరును అకాల వర్షాలు ముంచెత్తాయి. కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా జన జీవనం అస్తవ్యస్తమైంది.ఈ వరదల వల్ల బెంగళూరులోని ఓ బంగారం దుకాణం తీవ్రంగా నష్టపోయింది. ఆకస్మికంగా వరదనీరు దుకాణంలోకి చేరడంతో బంగారు ఆభరణాలు కొట్టుకొనిపోయాయని యజమాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగళూరులోని మల్లేశ్వర్ ప్రాంతానికి చెందిన నగల దుకాణం వరదనీటిలో చిక్కుకుంది.
అక్కడికి దగ్గరలో జరుగుతున్న నిర్మాణ పనులే ఈ వరదకు కారణమని దుకాణం యజమాని ఆరోపించారు. చెత్తాచెదారం కలిసిన వరదనీరు షాపులోకి ఒక్కసారిగా పోటెత్తడంతో.. అక్కడి సిబ్బంది షటర్లు మూయలేకపోయారని తెలుస్తోంది. వెంటనే మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసి, సహాయం కోరామని, కానీ తమకు సహాయం చేసేందుకు వారు రాలేదని యజమాని తెలిపారు. ఆ వరదనీటిలో 80 శాతం బంగారం కొట్టుకుపోయింది. దాని మొత్తం విలువ రెండుకోట్ల రూపాయల వరకు ఉంటుందని యజమాని వాపోయారు. అయితే ఇటీవల వచ్చిన వరదలకు ఆరుగురు మృతిచెందారని అధికారులు తెలిపారు.