కర్నాటక, మహారాష్ట్ర మధ్య ఏళ్ల నాటి బెళగావి సరిహద్దు సమస్య మరోసారి వార్తల్లో నిలిచింది. స్వాతంత్ర్యకాలం నాటి సమయంలో బెళగావి (బెల్గావ్) అనేది బాంబే ప్రెసిడెన్సీలో భాగం. అయితే.. రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకృత చట్టం 1956 ప్రకారం బెళగావ్, 10 తాలుకాలను మైసూర్ రాష్ట్రాంలో కలిపారు. ఆ తర్వాత మైసూరు పేరును కర్నాటకగా మార్చారు. ప్రస్తుతం బెళ్గావ్ కర్నాటకలో భాగం. కానీ, అది తమ భూభాగామని మహారాష్ట్ర అంటోంది.
బెళగావ్‌లో ఎక్కువ మంది జనం మరాఠీ మాట్లాడేవారేనని మహారాష్ట్ర అంటోంది. కాబట్టి ఆ ప్రాంతం తమ రాష్ట్రానికే చెందాలని డిమాండ్ చేస్తోంది. కాగా, రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకృత చట్టం 1956 ప్రకారం చేసిన నిర్ణయం అంతిమమని కర్నాటక వాదిస్తోంది. అయితే.. బెళగావ్ వివాదంపై 1966లో కేంద్రం జస్టిస్ మెహర్ చంద్ మహాజన్ కమిటీని నియమించింది. ఈ ప్రాంతంలోని 264 గ్రామాలు మహారాష్ట్రకు, 247 గ్రామాలు కర్నాటకకు ఇవ్వాలని కమిటీ సూచించింది. బెళగావ్‌ను కర్నాటకలోనే ఉంచాలని చెప్పింది. కానీ, మెహర్ చంద్ మహాజన్ కమిటీ ఇచ్చిన రిపోర్టును మహారాష్ట్ర తిరస్కరించింది. దాంతో ఆ సమస్య రావణకాష్టంలా రగులుతూ నిరంతరం వార్తల్లో నిలుస్తోంది.