తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. బాధితులకు బెడ్స్, ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని గాంధీ అస్పత్రిలో వెంటిలేటర్, ఆక్సిజన్ పడకలు పూర్తిగా నిండిపోయాయి. దీంతో ప్రత్యామ్నాయాలపై అధికారులు దృష్ఠి పెట్టారు. సోమవారమే వెంటిలేటర్, ఆక్సిజన్ పడకలు నిండిపోగా.. 30 మంది బాధితులను కింగ్‌కోఠి ఆస్పత్రికి వైద్యాధికారులు. చాలా మంది ఆక్సిజన్ స్థాయిలు 60, 40తో వస్తున్నారు. వీరిలో ప్రైవేటు ఆసుపత్రుల నుంచి వస్తున్నవారు కూడా ఉన్నారు. కింగ్ కోఠి ఆసుపత్రిలో ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉండటంతో కేవలం ఆక్సిజన్ అవసరం ఉన్న వారినే చేర్చుకుంటున్నట్లు అక్కడి డాక్టర్లు చెబుతున్నారు. మిగతా వారిని హోం ఐసొలేషన్, ప్రకృతి చికిత్సాలయానికి పంపిస్తున్నట్లు తెలిపారు.
కరోనా బారినపడిన వారంతా పరిస్థితి విషమించాక గాంధీ హాస్పిటల్‌కు వస్తునట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. వారిని కాపాడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా, అప్పటికే పరిస్థితి చేయిదాటి పోవడంతో మృతుల సంఖ్య పెరుగుతోందంటున్నారు. మృతుల్లో దీర్ఘకాలిక వ్యాధులతో చికిత్స పొందుతున్న వారు ఎక్కువగా ఉంటున్నట్లు చెబుతున్నారు. గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రిలో ఆక్సిజన్, మందులు, బెడ్ల కొరత లేనప్పటికీ సిబ్బంది కొరత ప్రధాన సమస్యగా మారిందంటున్నారు. దీంతో మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24గంటల వ్యవధిలో కొత్తగా 10,122 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 1440 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.