Tuesday, November 26, 2024

డిగ్రీతో పాటే బీఈడీ.. నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్స్‌.. ఈ ఏడాది నుంచే ప్రారంభం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఉపాధ్యాయ విద్యలో సంస్కరణలు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం డిగ్రీతో పాటే బీఈడీ చదువుకునేలా సరికొత్త ఇంటిగ్రేటెడ్‌ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభం కానున్న నాలుగేళ్ల కోర్సును బీఏ – బీఈడీ, బీఎస్సీ-బీఈడీ, బీకాం-బీఈడీ రూపంలో అందుబాటులోకి రానుంది. పైలట్‌ ప్రాజెక్టు కింద తొలిదశలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని యూనివర్సిటీలు, ఉపాధ్యాయ విద్యా సంస్థల్లో అమల్లోకి తీసుకొస్తున్నట్టు కేంద్ర విద్యాశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ కోర్సు ద్వారా నాలుగు దశల్లో ఉపాధ్యాయ శిక్షణ అందించనున్నారు.

ఫౌండేషనల్‌, ప్రిపరేటరీ, మిడిల్‌ దశలతో పాటు- సెకండరీలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన నూతన విద్యావిధానం ప్రకారం (5 ప్లస్‌ 3 ప్లస్‌ 3 ప్లస్‌ 4) బోధనా విధానాలపై కోర్సు ఉంటుంది. సాధారణంగా డిగ్రీ తర్వాత ఉపాధ్యాయ శిక్షణ కోర్సు చేపట్టాలంటే మరో రెండేళ్ల పాటు- బీఈడీ చదవాల్సి ఉంటుంది. దీంతో మొత్తం ఐదేళ్లలో పూర్తికావాల్సిన కోర్సును ఇంటిగ్రేటెడ్‌ కోర్సు ద్వారా నాలుగేళ్లలోనే పూర్తిచేయవచ్చు. అయితే ఈ కోర్సులో అడ్మిషన్లు కూడా నేషనల్‌ -టె-స్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వహించే నేషనల్‌ కామన్‌ ఎంట్రన్స్ టెస్ట్‌ ద్వారానే జరుపుతామని కేంద్రం వెల్లడించింది. 21వ శతాబ్దపు ప్రపంచశ్రేణి ప్రమాణాలతో కూడిన ఉపాధ్యాయులను అందించే క్రమంలో ఈ కోర్సును తీసుకొచ్చినట్టు కేంద్రం ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement