మచిలీపట్నం : గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని , ఇచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి మచిలీపట్నం నియోజకవర్గాన్నిఅభివృద్ధిపథంలో నడిపించడమే తన విధానమని రాష్ట్ర రవాణా, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. మచిలీపట్నం మండల పరిధిలోని సముద్రతీర ప్రాంతమైన తపసిపూడి గ్రామంలో తారు రోడ్డు నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. తపసిపూడి లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి ఊరి మధ్య పంచాయతీ కార్యాలయం, శివాలయం మీదుగా నుంచి మంగినపూడి బీచ్ రోడ్డు వరకు కిలోమీటరన్నర నిడివి గల బీటీ లేయర్ తారురోడ్డు నిర్మాణ పనులను 28 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టినట్లు తెలిపారు.
అలాగే మంగినపూడి బీచ్ రోడ్డు నుంచి పోలీస్ శిక్షణా కేంద్రం వరకు రహదారి అద్వానంగా మారిందని గ్రామస్తుల అబ్యర్ధన మేరకు ఆ రోడ్డుకు సంబంధించిన అంచనాలు రూపొందించి త్వరితగతిన నిధులు మంజూరు చేసి వచ్చే వర్షాకాలం లోపున ఆ రోడ్డు నిర్మాణ పనులు పూర్తిచేస్తామన్నారు. ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనేదే ప్రభుత్వ ధ్యేయమని, తన నియోజకవర్గ ప్రజలకు ఈ సౌకర్యం సమకూర్చే అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో తపసిపూడి గ్రామ సర్పంచ్ చందన మస్తానరావు , మచిలీపట్నం మాజీ జడ్పీటీసీ సభ్యులు లంకె వెంకటేశ్వరరావు ( ఎల్వీయార్), డ్వామా పి డి , మచిలీపట్నం ఎం పి డీ ఓ జీ. సూర్యనారాయణ, మచిలీపట్నం తహసీల్దార్ సునీల్ బాబు, పంచాయతీ రాజ్ డి ఈ లక్ష్మీనారాయణ, స్థానిక వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..