Monday, November 18, 2024

Big Story: బీ కేర్, మత్తు వైపు వెళ్లొద్దు-ముందు మురిపించినా, ఆ తర్వాత ముంచేస్తుంది!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో రైతులు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. అయితే దీన్ని అలుసుగా తీసుకున్న కొంతమంది దుండగులు రైతులకు మోసపూరిత మాటలు చెబుతూ వారిని గంజాయి సాగువైపు మళ్లిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే డ్రగ్స్ మాఫియా గుప్పిట్లో చిక్కి పలు రాష్ట్రాలు విలవిల్లాడుతున్నాయి. మెల్ల మెల్లగా విస్తరిస్తున్న మత్తు మాఫియాని అడ్డుకోవడంలో యావత్ యంత్రాంగం విఫలమవుతోంది.

కొలంబియా, మెక్సికో వంటి లాటిన్‌ అమెరికా దేశాల లెక్కనే ఇండియాలో కూడా కొన్ని రాష్ట్రాలు డ్రగ్స్ మాఫియా చెప్పు చేతుల్లోకి  వెళ్లే ప్రమాదం పొంచి ఉంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గంజాయి పంట సాగు పెరిగినట్టు తెలుస్తోంది. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి పంటను ధ్వంసం చేయడానికి వెళ్లిన ఎక్సైజ్ సిబ్బందిపై కొందరు దుండగులు రాళ్లు రువ్వడం వంటి ఘటనలు దీనికి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, ఝార్ఖండ్‌ వంటి కొన్ని రాష్ట్రాల్లో గంజాయి అక్రమంగా సాగవుతోంది. ఈ పంట నిర్మూలనకు ఏపీ పోలీసులు గత ఏడాది అక్టోబరు 30న ‘ఆపరేషన్‌ పరివర్తన్’ పేరిట భారీ కార్యక్రమం చేపట్టారు.

విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని 11 మండలాల్లో 253 గ్రామాల పరిధిలో 7,000 ఎకరాల్లో గంజాయి సాగులో ఉంది. కాగా, ఈ పంటలో 90శాతం ధ్వంసం చేసినట్టు పోలీసులు ప్రకటించారు. దాని మార్కెట్‌ రేట్ దాదాపు రూ.8,626 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. దీనికి సంబంధించి 546 మందిని అరెస్టు చేసి 214 కేసులు పెట్టారు. 100 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సాగు నిర్మూలనకు ఏపీ పోలీసు శాఖ 2020లో ఏర్పరచిన ప్రత్యేక ఎన్‌ఫోర్స్ మెంట్‌ బ్యూరో ఇంతవరకు 3 లక్షల కిలోల గంజాయిని పట్టుకున్నట్టు సమాచారం.

ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే…

అమెరికా, పరాగ్వే, కొలంబియా తర్వాత అత్యధిక పరిమాణంలో గంజాయి పట్టుబడింది ఇండియాలోనే అని తెలుస్తోంది. రాజస్థాన్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ అనుమతితో లైసెన్సు మీద నల్లమందు సాగు జరుగుతోంది. నల్లమందు నుంచి వైద్య అవసరాల కోసం మార్ఫిన్‌ తదితర ఉత్పత్తులను తయారు చేస్తారు. అయితే, ప్రభుత్వం క్రమంగా నల్లమందు విస్తీర్ణాన్ని తగ్గిస్తూ వస్తోంది.

- Advertisement -

అతి పెద్ద సమస్య ఇదే..

 ఒక దేశం డ్రగ్స్ మాఫియా గుప్పిట్లో చిక్కిందంటే ఇక దానికి విముక్తి అనేదే ఉండదని 1980ల నుంచి లాటిన్‌ అమెరికా దేశాల ఎక్స్ పీరియన్స్ ని పరిశీలిస్తే ఇదే నిరూపితమవుతోంది. మాదక ద్రవ్య ఉత్పత్తి, దొంగరవాణా వందల కోట్ల డాలర్ల వ్యాపారంగా మారి ప్రభుత్వాలను శాసిస్తుంది. మాఫియా ముఠాల మధ్య ఆధిపత్య పోరు.. హత్యలు, అపహరణలు, డబ్బు గుంజడంవంటి నేరాలు ఎక్కువవుతాయి. డ్రగ్స్ ముఠాలను కార్టెల్స్‌ అంటారు. అవి తమకున్న అపార ధనబలంతో- స్వార్థపరులైన కొందరు రాజకీయ నాయకులను, ప్రభుత్వ సిబ్బందిని కొనేస్తారు. ఎదురు తిరిగేవారిని అనవాళ్లు లేకుండా మట్టుపెడతారు. అట్లాంటి ముఠాల మారణ హోమంలో వందలాది అమాయక పౌరులు బలిఅవుతారు. డ్రగ్స్ మాఫియాతో అవినీతి పెరిగి ప్రభుత్వాలు పూర్తిగా నిర్వీర్యం కావాల్సి వస్తుంది. మత్తుమందు రాజ్యంలో సాంఘిక, రాజకీయ, ఆర్థిక రంగాలన్నీ భ్రష్టుపట్టిపోతాయి. డ్రగ్స్ కార్టెల్స్‌ పరస్పర దాడులకు దిగడంతో గూండాగిరీ, హత్యలు, బాంబు దాడులు పెచ్చరిల్లుతాయి.

హెరాయిన్‌ వంటి ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలు; సింథటిక్‌ మాదకద్రవ్యాలు, ట్రాంక్విలైజర్లు, నిద్ర మాత్రలు, సాల్వెంట్లు, ముక్కుతో పీల్చే ఇన్‌హేలర్లు ప్రపంచ డ్రగ్స్ వ్యాపారంలో ఒక భాగమై పోతాయి. 2019లో ప్రపంచంలో 15-, 64 ఏళ్ల మధ్య ఉన్నవారు 5.5శాతం ఏదో ఒక మాదక ద్రవ్యాన్ని వినియోగించినవారేనని ఐక్యరాజ్యసమితి 2021లో వెలువరించిన ప్రపంచ మాదకద్రవ్య నివేదిక చెబుతోంది. భారత్‌ తదితర అల్పాదాయ దేశాల్లో మత్తుమందు వినియోగం పెరుగుతోందని ఈ స్టడీ తెలిపింది. 2019లో ప్రపంచంలో 20కోట్లమంది గంజాయిని, 2 కోట్లమంది కొకైన్‌ను, 6.2 కోట్ల మంది హెరాయిన్‌ను వినియోగించారు. ఈ మాదకద్రవ్యాలకు ప్రధాన మార్కెట్లు అమెరికా, ఐరోపాలే అని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

దీనికి పరిష్కారం లేదా?

గిట్టుబాటు ధరలు లభించక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతులకు డ్రగ్స్ ముఠాలు వలవేసి గంజాయి పంట పండించేలా ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తోంది. దేశంలో తక్కువలో తక్కువగా 8 రాష్ట్రాలు పూర్తిగా వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. కాగా, ఈ రాష్ట్రాల్లోని రైతులు గంజాయి సాగువైపు మల్లే ప్రమాదం తలెత్తుతోంది. ఇట్లాంటి తరుణంలోనే  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందని, వామపక్ష తీవ్రవాదాన్ని రూపుమాపడంపై చూపుతున్న శ్రద్ధ, కేటాయిస్తున్న ఆర్థిక, మానవ వనరులను గంజాయి సాగు, రవాణాలను అడ్డుకోవడానికి వినియోగించాలని పరిశీలకులు చెబుతున్నారు.

మెక్సికో, కొలంబియాలలో రైతులకు మాదక ద్రవ్య సాగు వల్ల మొదట్లో కాస్త లాభం కనిపించినా, నిత్యావసరాల ధరల పెరుగుదలతో అది కాస్త ఉపయోగం లేకుండా పోయింది. డ్రగ్స్ ముఠాలే వందల కోట్ల డాలర్ల లాభాలను కళ్లచూస్తాయి తప్పితే రైతులకు ఎట్లాంటి ఉపయోగం ఉండదని ఇక్కడి పరిస్థితులు వెల్లడి చేస్తున్నాయి. మరోవైపు సమాజంలో మత్తు పదార్థాల అలవాటు పెరిగినప్పుడు అనారోగ్య సమస్యలూ అదే స్థాయిలో తలెత్తుతాయి. హెరాయిన్‌, నల్లమందు వాడకం వల్ల ఏటా 1.29 కోట్ల అకాల మరణాలు సంభవిస్తున్నాయని అధికారక నివేదికలు వెల్లడిస్తున్నాయి.  ‘‘అందుకని రైతులు కూడా ఇట్లాంటి ముఠాల మాటలు నమ్మి మోసపోకుండా ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టి సారించాలి. కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గజగజ వణికించిన ఫస్ట్ వేవ్ లోనూ దేశాన్ని ఆదుకున్నది రైతన్నలు, వ్యవసాయమే అన్న విషయాన్ని మరిచిపోవద్దు’’ అని విశ్లేషకులు చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement