Tuesday, November 26, 2024

BC Vote Bank Politics – అన్ని పార్టీల‌లోనూ బిసి మంత్ర …

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో:

జనాభా దామాషా ప్రకారం అసెంబ్లి ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు (బీసీ) పోటీ- చేసే అవకాశం ఇవ్వాలన్న డిమాండ్‌ అన్ని పార్టీల్లో అంతకతకూ పెరుగుతోంది. కాంగ్రెస్‌ పార్టీలో బీసీ సీనియర్‌ నేతలు ఒక్కో లోక్‌సభ నియోజకవర్గం నుంచి కనీసం ముగ్గురికి అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని పార్టీ అధినాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. అధికార బీఆర్‌ఎస్‌లోనూ ఇదే రకమైన డిమాండ్‌ ఉన్నప్పటికీ ఈ విషయాన్ని అధినాయకత్వం ముందు ఉంచేందుకు వెనుకాడుతు న్నారు. సీఎం కేసీఆర్‌ బీసీ పక్షపాతి అని, ఈ సామాజిక వర్గం జనాభా ప్రకారం ఎన్నికల్లో టికెట్లు- కేటాయిస్తారన్న నమ్మకం ఉందని భారాస బీసీ నేతలు చెబుతున్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట వేస్తామని భాజపా ప్రకటిస్తోంది. తమ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వెనుకబడిన తరగతులకు చెందిన వారిని సీఎం చేస్తామన్న ప్రకటన చేయడానికి భాజపా సిద్ధమైనట్టు- సమాచారం. ఎన్నికల ప్రణాళికలో బీసీ ముఖ్యమంత్రి అన్న అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించనున్నట్టు- విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

బీసీని సీఎంగా ప్రకటించాలన్న అంశానికి సంబంధించి భాజపా అధినాయకత్వం ఇప్పటికే చర్చోపచర్చలు చేసిందని అధికారిక ప్రకటనే తరువాయి అని పార్టీ అగ్రనేత ఒకరు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఇప్పటికే ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్టు- ఆ పార్టీలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. రాహుల్‌ గాంధీ నిర్ణయంతో కాంగ్రెస్‌లో ఈ వర్గాల వారికి సముచిత న్యాయం జరుగుతుందన్న ఆశాభావంతో ఉన్నట్టు- ఆ పార్టీ బీసీ నేతలు చెబుతున్నారు. బీసీలకు జనాభా ప్రకారం టికెట్లు- కేటాయించే అంశానికి సంబంధించి ఆగస్టు నెలలో సూర్యాపేటలో నిర్వహించనున్న బీసీ గర్జన సభలో నిర్ణయం వెలువడుతుందని ఆ సామాజిక వర్గం నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో 17 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయని, ఒక్కో లోక్‌సభ నుంచి మూడు అసెంబ్లీ సీట్లను బీసీలకు ఇవ్వాలన్నదే తమ అభిమతమని నేతలు చెబుతున్నారు.

బీసీల్లో బలమైన కులాలకు ఎన్నికల్లో పోటీ- చేసే అవకాశం ఇవ్వాలన్న డిమాండ్‌ కూడా బలంగా ఉన్నట్టు- సమాచారం. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నివాసంలో ఇటీ-వల సమావేశమైన కాంగ్రెస్‌ బీసీ నేతలు బీసీ జనాభా ప్రకారం పార్టీలో టికెట్లు- ఇవ్వాలన్న డిమాండ్‌ను పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ భేటీ-కి కొనసాగింపుగా పీసీసీ మాజీ చీఫ్‌ హనుమంతరావు కూడా బీసీలకు మెజారిటీ- స్థానాలు కేటాయించాలని పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఈ నెల 2న ఖమ్మం వచ్చిన సందర్భంగా ఆయన దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్టు- సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు అత్యధిక స్థానాలు కేటాయించాలన్న ప్రతిపాదన పార్టీ పెద్దల దృష్టికి మరో దఫా తీసుకెళ్తానని ఆయన చెప్పారు.

అసెంబ్లీలో బీసీ ఎమ్మెల్యేలు 23 మందే
ప్రస్తుత శాసన సభలో బీసీ వర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నవారు కేవలం 23 మంది సభ్యులే ఉన్నట్టు- సమాచారం. రెడ్డి సామాజిక వర్గం నుంచి 39 మంది, ఎస్సీలు 18, ఎస్టీలు 9, ముస్లిం మైనార్టీల నుంచి తొమ్మిది మంది ఉన్నారు. జనాభాలో అరవై శాతం ఉన్న బీసీలకు 50కి పైగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ-కి అన్ని పార్టీలు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

బీసీలకు భాజపా గాలం?
భాజపాలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రివర్గంలోకి బీసీ సామాజిక వర్గానికి చెందిన రాజ్యసభ సభ్యుడు, బీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ లేదా మరో బీసీ నేత బండి సంజయ్‌ని నియమించే అవకాశం ఉన్నట్టు- తెలుస్తోంది. అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి అని ప్రకటన చేయాలన్న ప్రతిపాదన కూడా భాజపా అధినాయకత్వ పరిశీలనలో ఉన్నట్టు- ప్రచారం జరుగుతోంది. ఎవరు సీఎం అభ్యర్థి అని కాకుండా బీసీ అవుతాడని చెప్పేందుకు పార్టీ సిద్ధమైందని చెబుతున్నారు. బీసీలో బలమైన సామాజిక వర్గాలైన ముదిరాజ్‌, మున్నూరు కాపులు తమతో అటాచ్‌ అయ్యారన్న భావన ఆ పార్టీలో ఉంది. బీసీని సీఎం చేస్తామని ప్రకటిస్తే గతంలో టీడీపీకి గట్టి ఓటు- బ్యాంకుగా ఉన్న బీసీ సామాజిక వర్గాలు తమ వైపుకి వస్తారని భాజపా ఆశిస్తోంది.

- Advertisement -

టీ-డీపీకి బీసీలు అండగా నిలిచినా… వారికి సీఎం అయ్యే అవకాశం రాలేదని, బీజేపీలో ఆ అవకాశం ఉంటుందన్న విషయాన్ని బీసీలలో పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని భావిస్తోంది. తమ వ్యూహం ఫలిస్తే టీడీపీలో క్రియాశీలకంగా పని చేసి ఇప్పుడు భారాసలో ఉన్నవారు కమలం తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని భాజపా భావిస్తోంది. సామాజిక సమీకరణాల్లో దిట్టయిన కేంద్ర మంత్రి అమిత్‌ షా రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టినప్పటప్పటి నుంచి సోషల్‌ ఇంజినీరింగ్‌ లెక్కలు వేసుకుంటు-న్నారని సమాచారం. ఆయన శిష్యుడు, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ సునీల్‌ బన్సల్‌ కూడా అదే పనిలో ఉన్నారని చెబుతున్నారు. యూపీలో సక్సెస్‌ అయినట్టే ఇక్కడ కూడా వ్యూహరచన చేస్తున్నారని చెబుతున్నారు. రెడ్డి ఓట్లను చీల్చడం, బీసీ ఓట్లను గంపగుత్తగా వేయించుకోవడం బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది.

భారాసలోనూ…
అధికార పార్టీ భారాస అధినేత కేసీఆర్‌ కూడా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గాలకు గతంలో కన్నా ఎక్కువగా సీట్లు- ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్నట్టు- సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ఆయన ఇప్పటికే ప్రారంభించినట్టు- చెబుతున్నారు. కొన్ని జనరల్‌ స్థానాల్లో బీసీలకు పోటీ- చేసే అవకాశం కల్పిస్తారన్న ప్రచారం పార్టీలో జరుగుతోంది. ఎన్నికల్లో పార్టీ తరపున బరిలో నిలిపే అభ్యర్థులకు సంబంధించిన పూర్తి వివరాలను కేసీఆర్‌ నిఘావర్గాల ద్వారా తెప్పించారని, వారి బలాబలాలు, అనుకూలతలు, ప్రతికూలతలపై కూడా ఆయన సమగ్ర సమాచారం తెప్పించినట్టు- చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement