– డిజిటల్ మీడియా, ఆంధ్రప్రభ
మొదటి ఏడు రోజులు (ఆరో రోజు మినహా) చిన్నారులు, పెద్దలు కలిసి చిన్న బతుకమ్మలతో పాటు పసుపుతో బొడ్డెమ్మ (గౌరీ దేవత) ప్రతిమ తయారు చేస్తారు. ఒక్కో రోజు ఒక్కో రకమైన ప్రసాదం ( నైవేద్యం) సమర్పిస్తారు. ఇందులో నువ్వులు, బియ్యం పిండి, తడి బియ్యం, బెల్లం మొదలైనవి ఉంటాయి. ఇక.. చివరి రోజు అంటే తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ.. ఈ బతుకమ్మను ప్రత్యేక పళ్లెం కానీ, పెద్ద తాంబాళం (ప్రత్యేక పాత్ర)లో కానీ భారీ బతుకమ్మలను పేరుస్తారు. పూలు పేర్చడంతో పాటు పాటలతో సందడి చేస్తారు.
ఒక్కో రోజు ఒక్కో తీరు బతుకమ్మ!
1) ఎంగిలి పూల బతుకమ్మ 2) అటుకుల బతుకమ్మ, 3) ముద్దపప్పు బతుకమ్మ 4) నానే బియ్యం బతుకమ్మ 5) అట్ల బతుకమ్మ..6) అలిగిన బతుకమ్మ.. ఈ రోజు ఆశ్వయుజ శుద్ధ పంచమి నైవేద్యమేమీ సమర్పించరు. 7) వేపకాయల బతుకమ్మ.. 8) వెన్నముద్దల బతుకమ్మ.. 9) సద్దుల బతుకమ్మ.
ఈ పండుగ పువ్వుల స్పష్టమైన వినియోగానికి ప్రసిద్ధి చెందినప్పటికీ బతుకమ్మ తయారీకి మొక్కల ఔషధ గుణాల గురించి దేశ పురాతన జ్ఞానంతో చాలా సంబంధం ఉందని నిపుణులు చెబుతుంటారు. సాంప్రదాయకంగా, స్థానికంగా పెరిగే పూలతోనే బతుకమ్మలను తయారు చేస్తారు. అట్లనే ప్రతి బతుకమ్మలో కొన్ని ప్రత్యేకమైన పువ్వులు గునుగు పువ్వు (సెలోసియా), తంగేడు పువ్వులు (కాసియా ఆరిక్యులాట), గుమ్మడి పువ్వులు (కుకుర్బిటా), వామ పువ్వులు (అజ్వైన్), బంతి పువ్వు (మేరిగోల్డ్), చామంతి పువ్వు (క్రిసాన్తిమం) మొదలైనవి తప్పకుండా ఉంటాయి.
మొదటిరోజు చేసుకునే బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. దీన్ని ఎందుకు అలా పిలుస్తారంటే.. సాధారణంగా పూలను చేయి లేదా కత్తెరతో కట్ చేస్తాం. కానీ, కొందరు నోటితో కూడా తుంచి బతుకమ్మను తయారు చేస్తారు. ఆ విధంగా మొదటిరోజు చేసే బతుకమ్మకు ఎంగిలిపూల బతుకమ్మ అని ప్రాచుర్యంలోకి వచ్చింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మను రాష్ట్ర పండుగగా ప్రకటించింది.