Tuesday, November 26, 2024

తెలంగాణలో కొత్త‌గా 33 మెడిక‌ల్ కాలేజీలు.. పట్టణాల్లో 60 బస్తీ దవాఖానలు ఏర్పాటు

తెలంగాణ రాష్ట్రంలో కొత్త‌గా 33 మెడిక‌ల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నామ‌ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సంవ‌త్స‌రానికి 2 వేల సీట్ల చొప్పున ఎంబీబీఎస్ సీట్ల‌ను పెంచుకుంటున్నామ‌ని తెలిపారు. తెలంగాణ పై కేంద్రం తీవ్ర వివక్ష చూపిందని, 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి ఇవ్వలేదని మండిపడ్డారు. రాష్ట్రం ఏర్ప‌డే నాటికి ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య‌ 700లుగా ఉంటే.. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రానికి ఈ సంఖ్య 2,850కి పెంచుకోబోతున్నామని తెలిపారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌ల ఏర్పాటుపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి హ‌రీశ్‌రావు స‌మాధానం ఇచ్చారు.

వైద్యారోగ్య రంగాన్ని ఉమ్మడి పాలకులు నిర్లక్యం చేశారని, తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 3 మెడికల్ కాలేజీలు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్యను 33 కి పెంచుకుంటున్నామన్నారు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్, సిద్దిపేట‌, సూర్యాపేట‌, న‌ల్ల‌గొండ‌, సంగారెడ్డి, మ‌హ‌బూబాబాద్, మంచిర్యాల‌, వ‌న‌ప‌ర్తి, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, జ‌గిత్యాల‌, నాగ‌ర్‌క‌ర్నూల్, రామ‌గుండం ఏరియాల్లో కొత్త మెడిక‌ల్ కాలేజీల‌ను ఏర్పాటు చేస్తోంద‌న్నారు. మ‌రో 8 ప్ర‌దేశాల్లో అనుబంధంగా ఉన్న ఆస్ప‌త్రుల‌ను అప్‌గ్రేడ్ చేయాల‌ని నిర్ణ‌యించ‌డం జ‌రిగింది. ఆసిఫాబాద్, భూపాల‌ప‌ల్లి, వికారాబాద్, సిరిసిల్ల‌, జ‌న‌గామ‌, కామారెడ్డి, క‌రీంన‌గ‌ర్, ఖ‌మ్మంలో మెడిక‌ల్ కాలేజీల‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది. మ‌హ‌బూబాబాద్, సిద్దిపేట‌, సూర్యాపేట‌, న‌ల్ల‌గొండ వ‌ద్ద 4 వైద్య క‌ళాశాల‌ల‌ను ఏర్పాటు చేసి, నిర్వ‌హ‌ణ‌లోకి తీసుకువ‌చ్చామ‌ని తెలిపారు. 

తెలంగాణ‌కు ఒక్క కాలేజీ ఇవ్వ‌కుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీవ్ర అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం మంజూరు చేసిన మెడిక‌ల్ కాలేజీల‌కు రూ. 200 కోట్లు గ్రాంట్‌గా ఇవ్వ‌డం జ‌రుగుతుందన్నారు. రాష్ట్రం నుంచి ప్ర‌తిపాద‌న‌లు పంపినా కూడా చిన్న‌చూపు చూస్తూ పట్టించుకోలేదని మండిపడ్డారు. ఉక్రెయిన్ వెళ్లిన మన విద్యార్థుల బాధలు వర్ణనాతీతం అని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యమే దీనికి కారణం అని ఆరోపించారు. వైద్య,విద్య కోసం భాష రాకపోయినా ఉక్రెయిన్, చైనా తదితర దేశాలకు వెళ్లి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి హరీష్ రావు తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నందున విద్యార్థులు ఇక్కడే వైద్య విద్యను చదువుకోవడం సాధ్యం కానుందని చెప్పారు. పట్టణాల్లోని పేదల సుస్తీని పోగొడుతూ..బస్తీ దవాఖానలు గొప్పగా సేవలు అందిస్తున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో దేశంలో మొదటి సారి ఏర్పాటు చేసిన ఈ బస్తీ దవాఖానపై 15వ ఆర్థిక సంఘం ప్రశంసలు కురిపించిందన్నారు. దేశం మొత్తం ఈ విధానం అనుసరించాలనీ సూచించిందని చెప్పారు. ఇప్పటి వరకు 81 లక్షల మందికి సేవలు పొందారని, బస్తీ దవాఖానల నుండి టెలి మెడిసిన్ సేవలు సైతం అందిస్తున్నామని మంత్రి వివరించారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వైద్యులు ఈ విధానం ద్వారా అవసరమైన సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఉచితంగా 57 రకాల పరీక్షలు, ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించడం వల్ల పట్టణ పేదలకు ఎంతో ఉపయోగం ఉందని చెప్పారు. రాష్ట్రంలోని ఇతర పట్టణాలకు విస్తరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని, అన్ని పట్టణాల్లో 60 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement